ఇది తేనె తెలుగు పదానికి పట్టాభిషేకం! ఇది కమనీయ తెలుగు వాక్యానికి సింగారించిన అలంకారం! ఇది తెలంగాణ తెలుగు భాషకు అంగరంగ వైభవంగా మొదలైన బ్రహ్మోత్సవం!! మన బొట్టును.. మన బోనాన్ని.. మన సంస్కృతిని.. మన భాషను కాపాడుకునేందుకు నడుంకట్టిన పాలనలో.. మన అజంత భాష అక్షర సింహాసనాన్ని అధిష్ఠించింది! పాల్కురికి ప్రాంగణంలో.. పోతనామాత్యుని వేదికపై తెలుగు నుడికారం తేనెలొలికింది! తెలంగాణ మాగాణంలో వికసించిన ఎందరో సాహితీకుసుమాల నామస్మరణలతో తెలుగు సంబురం ప్రణవనాదం పలికింది! మమ్మీలనే బడిపలుకుల పరభాషకన్నా.. అమ్మా.. అనే పలుకుబడుల భాషకు గుత్తాధిపత్యాన్ని కట్టబెడుతున్నట్టు ఘనమైన ప్రకటన చేసింది! హేమంతం ముప్పిరిగొంటున్న రాత్రి.. పటాకుల వెలుగు ముగ్గులు గగనతలాన్ని వర్ణశోభితం చేస్తూ.. ముగ్ధ మనోహర దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించిన వేళ.. ప్రపంచ తెలుగు మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. విశిష్ట అతిథులు గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు సహా అశేషంగా హాజరైన ప్రతినిధులు, పండితులు, మహనీయులు, విద్వాంసులు, అతిథుల సమక్షంలో.. తెలుగు భాషను మాతృసమానంగా భావించే ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు.. ఐదురోజులపాటు సాగే విశ్వ తెలుగు సంరంభం ప్రారంభమైందని లాంఛనంగా ప్రకటించారు. అంతకుముందు అధ్యక్షోపన్యాసం చేసిన సీఎం కే చంద్రశేఖర్‌రావు అమ్మ ఒడే తొలి బడి అన్నారు. జో అచ్యుతానంద.. అంటూ జోలపాటతోనే తన బిడ్డకు తల్లి సాహిత్యాన్ని అలవాటు చేస్తుందని చెప్పారు. సభాప్రారంభానికి ముందే తన చిన్ననాటి గురువు బ్రహ్మశ్రీ మృత్యుంజయశర్మను సత్కరించి.. పాదాభివందనం చేసిన సీఎం.. గురువు గొప్పదనాన్ని, తనలోని నిగర్విని మరోసారి ప్రపంచానికి చూపారు. తెలంగాణ అద్భుతమైన సాహిత్యాన్ని పండించిన మాగాణమంటూ పాల్కురికి మొదలు.. నేటి తరంలోని గోరటి వెంకన్న, అందెశ్రీ, జయరాజ్ వంటి ఈ గడ్డపై పుట్టిన సాహితీదిగ్గజాలను మననం చేసుకున్నారు. తెలంగాణ బిడ్డలు తెలుగు భాషాఖ్యాతిని ఇనుమడింపజేశారని కొనియాడారు. తెలుగును విశ్వవ్యాప్తం చేసేందుకు అందరం సంకల్పం తీసుకుందామని పిలుపునిచ్చారు.


రాష్ట్రంలో తెలుగు భాష వికాసంకోసం శతధా, సహస్రధా కృషిచేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. ఈ క్రమంలోనే ఒకటో తరగతి నుంచి పన్నెండోతరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరి పాఠ్యాంశంగా అమలుచేసేందుకు కచ్చితమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. తెలుగు భాషను ఉద్ధరించాల్సిన, పరిరక్షించాల్సిన బాధ్యత తెలుగు పండితులపైననే ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణలో తెలుగు భాషావికాసం కోసం, తెలుగు విలసిల్లడంకోసం తెలుగును విశ్వవ్యాప్తం చేయడంకోసం ప్రపంచ తెలుగు మహాసభల మహోత్సవానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వివరించారు. పాల్కురికి సోమనాథుడు ప్రాంగణం (ఎల్బీ స్టేడియం)లో బమ్మెర పోతన వేదిపై నుంచి మహా సంకల్పానికి దీక్ష తీసుకున్నామని వెల్లడించారు. తెలుగుభాషను విశ్వవ్యాప్తంచేయడమే తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన ఉద్దేశమని ఆయన ప్రకటించారు. భాషకు ఎల్లలుండవని చెప్పారు. ప్రపంచ దేశాలలో స్థిరపడిన తెలుగు భాషాభిమానులందరూ తెలుగు భాషావ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వంచేస్తున్న కృషిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తిచేశారు. తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్ రాష్ట్రంలోని తెలుగు భాషా పండితులకు కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారని, ఆ సమస్యలన్నింటినీ వారం పదిరోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

తెలుగుపై మక్కువ ఇలా పెరిగింది..
చిన్ననాటి నుంచి తనకు తెలుగుపై ఆసక్తిపెరిగేందుకు దోహదం చేసిన అంశాలను సీఎం మననం చేసుకున్నారు. తన చిన్ననాటి గురువు బ్రహ్మశ్రీ మృత్యుంజయశర్మవంటివారు తనకు తెలుగు భాషపైన మక్కువ పెంచడం వల్లనే తెలుగు భాషలో సాధన చేశానని, కొద్దోగొప్పో మాట్లాడగలుగుతున్నానని అన్నారు. చిన్నతనంలో రాఘవరెడ్డి అనే ఉపాధ్యాయుడి వీధి బడిలోనే చదువుకున్నానని, ఆయనే తనలోని తెలుగు ప్రేమను గ్రహించి, మృత్యుంజయశర్మకు అప్పగించారని చెప్పారు. రాయి వంటి తనకు మృత్యుంజయశర్మ సానబట్టారని చెప్తూ.. రత్నమయ్యానో లేదో తనకు తెలియదని సీఎం చమత్కరించారు. నిజంగానే ఉత్తర గోగ్రహణంలోని పద్యం తనను ప్రభావితం చేసిందని గుర్తుచేసుకున్నారు. ఉత్తర గోగ్రహణం పద్యాన్ని అప్పజెప్పిన వారికి బహుమతి ఇస్తానని మృత్యుంజయ శర్మ చెప్పడంతో అప్పటికప్పుడే ఐదుసార్లు మననం చేసుకుని.. భీష్మ ద్రోణ కృపాది ధన్వికరాబీలంబు.. పద్యాన్ని కంఠతా అప్పజెప్పానని సీఎం జ్ఞాపకం చేసుకున్నారు. వెంటనే మృత్యుంజయశర్మ పాఠశాల ప్రధానోపాధ్యాయుని సమక్షంలో తనకు నోట్‌బుక్ బహుమతిగా ఇచ్చారని తెలిపారు. తనకు లభించిన ఈ సాహిత్యాభినివేశం గురువులు పెట్టిన జ్ఞానభిక్షని చెప్పారు. గొప్ప గురువులు శిష్యులను ఉద్ధరించడం వల్లే ఈనాటికీ తెలుగు భాష గొప్పతనం, విశిష్టతలు నిలిచి ఉన్నాయని కేసీఆర్ అన్నారు.

అమ్మ ఒడి తొలి బడి..
అమ్మ ఒడి తొలి బడి అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఏ బిడ్డ అయినా అమ్మ ఒడిలోనే మొదటి పాఠాలు నేర్చుకుంటుందన్నారు. జో అచ్యుతానంద జోజో ముకుందా.. లాలిపరమానంద.. రామగోవిందావంటి జోలపాటలతో తల్లి తన బిడ్డ గోవిందుడు, అచ్యుతుడు కావాలని కోరుకుంటుందంటూ భావాన్ని వివరించారు. జోలపాటల నుంచే తెలుగు తీయదనాన్ని పసిబిడ్డలు ఆస్వాదిస్తారని చెప్పడానికి ఇవి ఉదాహరణలని పేర్కొన్నారు. ఆ విధంగా చిన్ననాటి నుంచి అమ్మానాన్నలు, గురువుల చెరగని ముద్రలు తనపై ఉన్నాయని చెప్పారు.