ఏ దారి చూసినా.. తెలుగు భాషాభిమానులే..!
ఏ వీధి చూసినా.. సాహిత్యాభిలాషులే..! ఏ వాహనం అయినా.. తెలంగాణ భాషావాదులే..! ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రపంచమే కదలి వచ్చిందా అనేట్టు.. తెలుగువారు కదంతొక్కారు. శుక్రవారం ఎల్బీస్టేడియంతోపాటు హైదరాబాద్ ప్రధాన దారులన్నీ తెలంగాణ భాషాభిమానులు, తెలుగు సాహిత్య అభిమానులతో నిండిపోయాయి. ప్రపంచ తెలుగు మహాసభలకు జనం జేజేలతో పోటెత్తారు. కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, అభిమానులు, రచయితలు, పిల్లలు, పెద్దలు.. అందరూ ఎల్బీ స్టేడియానికి తరలిరావటంతో.. ప్రపంచ పండుగకు తెలుగుశోభ వచ్చింది. హైదరాబాద్ నుంచే కాకుండా.. ఇతర రాష్ర్టాలు, దేశాల నుంచి సుమారు ఎనిమిదివేల మందికిపైగా ప్రతినిధులు వచ్చారు. విదేశాల నుంచి సుమారు 450 మంది ప్రతినిధులు శుక్రవారం ఉదయానికిల్లా హైదరాబాద్‌కు చేరుకున్నారు. తెలంగాణవ్యాప్తంగా తెలుగు పండితులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సాహిత్యాభిలాషులు, తెలుగు భాషాభిమానులు, ప్రజలు.. వాహనాలు, బస్సుల్లో హైదరాబాద్‌కు తరలిరావడంతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ నిండిపోయాయి.

ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చిన కవులు, కళాకారులు, పండితులు, రచయితలు, సాహితీవేత్తలు, ప్రతినిధులు, అభిమానులు ఆసీనులు కాగా.. స్థలం సరిపోక.. స్టేడియం బయట భాషాభిమానులు, ప్రజలు వేచి చూడాల్సి వచ్చింది. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు, సికింద్రాబాద్, కోఠిరోడ్డు, లక్డీకాఫూల్, సచివాలయం, అసెంబ్లీరోడ్డు.. ఇలా ఎల్బీ స్టేడియంకు దారితీసే ప్రతిరోడ్డు కూడా తెలుగు భాషాభిమానులు, ప్రజలతో నిండిపోయింది. స్టేడియం చుట్టూ ఏర్పాటుచేసిన పుస్తక ప్రదర్శనలు, పుస్తకావిష్కరణ వేదికలు, ఛాయాచిత్ర ప్రదర్శనలు అభిమానులను అలరించగా.. తెలంగాణ, తెలుగు అభిమానులందరినీ నోరూరించేలా వంటకాలను వడ్డించారు. ఇప్పటివరకు వివాహ భోజనంబు అని పాడుకున్న తెలుగువారు.. ఇకపై తెలంగాణ తెలుగు వంటకాలు అని పాడుకునేలా రుచులు చూశారు. తాముసైతం అంటూ.. రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, కూడా హాజరయ్యారు. అధికార టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, టీడీపీ నుంచి కూడా తెలుగు భాషాభిమానులు తరలిరావటంతో.. హైదరాబాద్ యావత్తూ.. తెలుగు అక్షరాల సుగంధాలతో నిండిపోయింది. వక్తల ప్రసంగాలు.. తెలుగు భాష ఔన్నత్యాన్ని రూచిచూపించగా.. సభలకు తరలి వచ్చిన ఆశేష జనవాహిని తెలుగుభాషకు జేజేలు.. అమ్మభాషకు జేజేలు అంటూ కదం తొక్కడంతో.. ప్రపంచ తెలుగు మహాసభలు నభూతో నభవిష్యత్ అనే రీతిలో ప్రారంభమయ్యాయి..!