పద్యం పరిమళించింది, ‘పదం’ కదం తొక్కింది, వాగ్గేయ వైభవం వెల్లివిరిసింది, నృత్యరీతుల మంజీర నాదాల మధురిమ మదిమదిలో మారుమోగింది, వైవిధ్య ప్రక్రియ సాహితీ సమారాధన తరతరాల రసాల రుచులను విందులు చేసింది! కోట్లమంది తెలుగుల గుండెల చప్పుడు ప్రగతి ప్రస్థాన పథంలో ధ్వనించింది, ఆద్యంతరహిత చరిత్ర గగనంలో ప్రతిధ్వనించింది.

భాగ్యనగరంలో ఐదు రోజులు జరిగిన ‘ప్రపంచ తెలుగు మహాసభలు’ ఈ ధ్వనులు, ఈ ప్రతిధ్వనులు, తెలుగు భాషా సరస్వతిని మరోసారి మంగళాభిషిక్తను చేసిన శుభంకర పయోధునులు… ఇది తెలుగువారి అనాది జీవనయాత్ర పునరావృత్తికి ప్రతీక, సరికొత్త ప్రారంభానికి సన్నద్ధమైన తెలుగు జనసముదాయ సమష్టి చిత్తవృత్తికి పతాక.. ఐదురోజుల పాటు కలియుగం 5119వ సంవత్సరం శుభ హేమలంబి మార్గశిర బహుళ త్రయోదశి శుక్రవారం – 2017 డిసెంబర్ పదహైదవ తేదీ – నాడు ఈ మహాసభలు ప్రారంభమైనట్లు పాల్కురికి సోమన ప్రాంగణంలోని బమ్మెర పోతన వేదికపై నిలబడి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించిన దృశ్యం తెలుగు వారి హృదయసీమలలో అజరామరంగా ఆవిష్కృతవౌతూనే ఉంటుంది! ఈ దృశ్యమాలిక ఐదురోజుల పాటు పుష్యశుద్ధ శుభ పాడ్యమి, మంగళవారం – డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ వరకూ – అవిచ్ఛిన్నంగా తెలుగువారి సర్వస్వాన్ని, ఆంధ్రుల అస్తిత్వాన్ని సమావిష్కరించింది! ప్రారంభ సభకు హాజరయిన ఉపరాష్టప్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, సమారోప సభను సుసంపన్నం చేసిన రాష్టప్రతి రామనాథ కోవింద్ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఈ మధురభావాక్షర మహా యజ్ఞాన్ని ప్రశంసించడం, అందువల్ల సహజ అనుభూతులకు శాశ్వత దర్పణం..
భాష మానవ జీవన మాధ్యమం, ఈ మాధ్యమం ద్వారా మానవ జీవన సంస్కృతి నిరంతరం ప్రస్ఫుటిస్తోంది! ఈ ప్రస్ఫుటికి ప్రపంచ మహాసభలు మరోసారి భాష్యం చెప్పాయి! జ్ఞానపీఠం అధివసించిన వారి నుండి జానపదునివరకూ, చర్మంతో చెప్పులు కుట్టి సమాజ పాదాలకు సమాజ స్వరూపానికి సంరక్షణ కల్పిస్తున్న వారి నుండి పొలం దున్ని అన్నం ప్రసాదిస్తున్న ‘హలం’ వీరుల వరకూ, గ్రామీణుల నాదం నుంచి అనాది వేదం వరకూ, పసిపాప పరిశోధన స్వరం నుంచి పండితుని పరిణత గళం వరకూ విస్తరించిన మాతృభాష, తెలుగుభాష ద్వారా ప్రస్ఫుటిస్తున్న ‘సంస్కార పరంపర’ ఒక్కటే. ఈ ‘సంస్కార పరంపర’ భారతీయ సంస్కృతి. భారత జాతీయత! ఈ అద్వితీయ భారత జాతీయత, అద్వితీయ భారత సంస్కృతి నిరంతరం మన తేనెల తెలుగుభాష ద్వారా ప్రస్ఫుటిస్తుండడం తరతరాల చరిత్ర.. ఈ చరిత్రకు మరో ‘బృహత్ ఆవిష్కరణ’ తెలంగాణ ప్రభుత్వం అత్యద్భుతంగా నిర్వహించగలిగిన ‘ప్రపంచ తెలుగు మహాసభలు’.. ‘‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని’’ అన్న రాయప్రోలు గీతాన్ని రాష్టప్రతి మహాసభ వేదికపై ప్రస్తావించడం ఈ భాషా మహాయజ్ఞానికి సముచితమైన శుభంకరమైన ఫలశ్రుతి.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలిరోజున సభావేదికపై తన తొలి గురువైన మృత్యుంజయశర్మకు పాదాభివందనం చేసి సత్కరించడం ఈ సంస్కార పరంపర కొనసాగింపునకు సరికొత్త ధ్రువీకరణ! తుది రోజున తెలంగాణ ముఖ్యమంత్రి మళ్లీ ఈ సంస్కారాన్ని ప్రస్తావించడం భరతమాతకు తెలుగుబిడ్డడు సమర్పించిన మంగళ నీరాజనం! మాతృభాష ద్వారా మాతృదేశపు జీవన సంస్కృతి ప్రస్ఫుటిస్తోంది.. మహాసభలు సాధించిన మరపురాని విజయం ఇది!!
తెలంగాణ తెలుగు భాషకు శైశవ డోలిక, ఆంధ్ర సాహిత్య సస్యాంకురాలు మహావృక్షాలుగా ఎదిగి మానవీయ ఫలాలు పండిన సతతహరిత వేదిక! తెలుగు అంకురించింది, తెలుగు పల్లవించింది, తెలుగు వికసించింది, తెలుగు పరిమళించింది… ఈ తెలుగు తీయతనానికి భూమిక తెలంగాణ, దివ్యధాత్రికి భౌతికరూపం! దివ్యధాత్రికి మరో భౌతిక రూపం ఆంధ్రప్రదేశ్! తెలుగుభాష సరస్వతి, ఉభయ ప్రాంతాల మధ్య సాహిత్య వారధి! ‘దివ్యధాత్రి’పై ‘సరస్వతి’ మరోసారి సభలు తీర్చిన దృశ్యం ఐదురోజుల పాటు ఆవిష్కృతమైంది! ఉభయ రాష్ట్రాల నుండి మాత్రమేకాదు, దేశంలోని అనేక రాష్ట్రాల నుండి ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుండి తరలివచ్చిన వరాలబిడ్డలు తెలుగు భాషామతల్లిని అర్చించారు! ఈ ‘అర్చన’ రాష్టప్రతి చెప్పినట్లు ‘‘తెలుగుభాషకు వ్యాకరణం వ్రాసిన’’ నన్నయనాటి నుంచి కొనసాగుతోంది, అంతకు పూర్వం నుండి అనాదిగా కొనసాగుతోంది. ఇదీ తెలుగువాని జీవన ప్రస్థానం, తెలుగుగడ్డపై యుగాలుగా జీవిస్తున్న భారతపుత్రుల మాతృభాషా వికాసక్రమం.. జగత్‌హిత సాధనం ఈ భారతీయ సంస్కారం… అందుకే నన్నయ్య అదే చెప్పాడు, బమ్మెర పోతన్న పునరుద్ఘాటించాడు, తాళ్లపాక అన్నమయ్య, కంచర్ల గోపన్న కొనసాగించారు… ఈ తెలుగుల పథంలో సామ్రాజ్యాలు వెలశాయి, సంక్షేమం వికసించింది, సమన్వయం సహిష్ణుతాభావం నర్తించాయి, ప్రగతి పరుగులు తీసింది! ఈ సమగ్రతత్త్వానికి మరో సాకారం ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా సమకూడిన వర్తమాన వాస్తవం! ఈ వాస్తవాన్ని నిలబెట్టిన తెలంగాణ ప్రభుత్వం అభినందనీయం… ‘‘దేశ భాషలందు తెలుగు లెస్స’’ అన్నది రాష్టప్రతి రామనాథ్ కోవింద్ మరోసారి నిగ్గుతేల్చిన చారిత్రక సత్యం!!

తెలుగు భాషను ఒకటవ తరగతి నుంచి పనె్నండవ తరగతి వరకు అన్ని విద్యాలయాలలోను విధిగా బోధించాలన్న తమ ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించడం ‘ప్రపంచ తెలుగు మహాసభ’లకు కల్యాణకారకమైన మమకార ప్రేరకమైన ఫలశ్రుతి! మాతృభాష ‘మృతభాష’ కాదని కాబోదని తెలుగు ప్రజల జీవనస్థిత భాషగా నిరంతరం వికసించగలదని తెలంగాణ ముఖ్యమంత్రి వ్యక్తం చేసిన విజయ విశ్వాసం తెలుగు ప్రజలందరి సమష్టి అంతరంగ భావామృత తరంగం.. ‘‘అట జనికాంచె భూమి సురుడంబర చుంబి.. శీతశైలమున్!’’ అన్న అల్లసాని పెద్దన పద్యాన్ని, ‘‘ననుభవదీయ దాసుని’’ అన్న పారిజాతాపహరణ ప్రబంధాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఉటంకించిన తీరు ‘పరిపాలకుని’లోని ‘్భషా సాహిత్య పటిమ’కు నిదర్శనం. భోజుడు, ఆంధ్రభోజుడు పరిపాలన శాస్తవ్రేత్తలు, సాహితీమూర్తులు! తాను మరో సాహితీ మూర్తినని తెలంగాణ ముఖ్యమంత్రి ధ్రువపరుచుకున్నాడు, చరిత్రను మెరుగుపెట్టాడు! చిన్న పిల్లలందరికీ ఇలా వందల పద్యాలను కంఠస్థం చేయించగల విద్యావిధాన ఫలితం ఇది! చంద్రశేఖర రావు సజీవ సాక్ష్యం.. మరి తెలంగాణ ప్రభుత్వం ఈ విద్యావిధానాన్ని ఎందుకు పునరుద్ధరించరాదు?? కనీసం ఎనిమిదవ తరగతి వరకు తెలంగాణలోని అన్ని పాఠశాలలలోను అన్ని విషయాలను తెలుగులో మాత్రమే బోధించాలని ఎందుకు నిర్దేశించరాదు?? అలా జరిగితే ప్రతి విద్యార్థి తెలంగాణ ముఖ్యమంత్రివలె చిన్ననాటనే అనేక పద్యాలను – వేలుకాకపోయినా వందలను – కంఠస్థం చేయగలరు. పద్యాలు సంస్కార భావ కిరణాలు.. ‘ప్రపంచ సభల’ ప్రభాత దీప్తిలో ఈ కిరణాలు అసంఖ్యాకంగా విస్తరించాలి!