కేంద్ర సాహిత్య అకాడమీలో కవి యాకూబ్‌, శిఖామణి మరో ముగ్గురికి చోటు

హైదరాబాద్‌ కేంద్ర సాహిత్య అకాడమీకి తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఐదుగురు సభ్యులు సాహిత్య సేవలో తరిస్తున్నారు. సాహిత్య రంగానికి వారు చేసిన సేవలకు గాను వారికి ఈ గుర్తింపు లభించగా… వారి పరిచయం…

కవిసంగమం కర్త యాకూబ్‌
ఇంటిపేరునే కవిగా మలుచుకున్న సాహితీవేత్త డాక్టర్‌ షేక్‌ యాకూబ్‌. కవిత్వం జయహో నినాదంతో కవులందరినీ కూడగట్టి భాగ్యనగరంలో ఓ వేదికను నెలకొల్పిన కవి యాకూబ్‌. వర్థమాన, ఔత్సాహిక కవులకు ఇతనొక ప్రేమికుడు కూడా. తెలుగునాట కవితోద్యమానికి ఊపిరిలూదిన వ్యక్తి యాకూబ్‌ అని ఆశారాజ్‌ వంటి ప్రముఖ కవులు అభివర్ణిస్తారు. ఖమ్మం జిల్లాలోని రొట్టమాకురేవు యాకూబ్‌ సొంతూరు. హైదరాబాద్‌లోని అన్వర్‌ ఉల్‌ ఉలూమ్‌ డిగ్రీ కళాశాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ‘‘ప్రవహించే జ్ఞాపకం’’, ‘సరిహద్దు రేఖ’’ వంటి పలు కవితా సంపుటిలు రచించారు. ‘‘తెలుగు సాహిత్య విమర్శలో రా.రా మార్గం’’, ‘‘పాఠక ప్రతిక్రియ’’, ‘‘తెలంగాణ సాహిత్య విమర్శ’’, ‘‘ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ’’ వంటి పలు విమర్శనా గ్రంథాలు రచించారు. ‘‘గుజరాత్‌ గాయం’’, ‘‘మన చలం’’ వంటి పలు సంచికలకు సంపాదకత్వం వహించారు. ‘‘ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌’’, తెలుగు యూనివర్సిటీ ధర్మనిధి పురస్కారంతోపాటు ఆలూరి బైరాగి అవార్డును అందుకున్నారు.

‘‘మువ్వల చేతి కర్ర’’ కవి శిఖామణి
యానంకు చెందిన ప్రముఖ కవి, విశ్రాంత ఆచార్యులు శిఖామణి అసలు పేరు కర్రి సంజీవరావు. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ తులనాత్మక అధ్యయన శాఖ ఆచార్యునిగా, డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1987లో శిఖామణి కలం పేరుతో తొలి కవితా సంపుటి ‘‘మువ్వల చేతి కర్ర’’ కవితలు విమర్శకుల ప్రశంసలు పొందడంతోపాటు పలు రాష్ట్రస్థాయి అవార్డులు, పురస్కారాలకూ ఎంపికైంది. ఇప్పటివరకూ పది కవితా సంపుటిలు వెలువడ్డాయి. శిఖామణి కొన్ని కవితలు ఇంగ్లీషు, హిందీ, ఫ్రెంచ్‌ భాషల్లోకి అనువాదమయ్యాయి. ‘‘కవి సంధ్య’’ పేరుతో ఇప్పటివరకు 12 కవితా సంచికలను ప్రచురించారు. ఏపీ ప్రభుత్వం నుంచి ‘‘కళారత్న’’, ‘‘జాషువా’’ పురస్కారం అందుకున్నారు. ‘‘పఠాభి సాహిత్యం’’పై పరిశోధన చేసి ఆంధ్ర వర్సిటీ డాక్టరేట్‌ పొందారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి ‘‘అనుభూతి, మానవత్వం కలగలస్తే శిఖామణి కవిత్వం’’ అని సినారే అన్నారు.

అంపశయ్య నవీన్‌
సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ నవలా రచయిత అంపశయ్య అసలు పేరు దొంగరి మల్లయ్య. 1968లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జీవితం, రాజకీయాలు ఇతివృత్తంగా ఆయన రచించిన ‘‘అంపశయ్య’’ తెలుగునాట ఓ సంచలనం. తర్వాత ఆ నవల పేరే ఆయన ఇంటిపేరుగా మారింది. వరంగల్‌జిల్లా పాలకుర్తి మండలం, వావిలాల నవీన్‌ సొంతూరు. కరీంనగర్‌, వరంగల్‌ జిల్లా ప్రభుత్వ కళాశాలల్లో ఆర్థికశాస్త్ర ఆచార్యునిగా పనిచేస్తూ 1996లో పదవీ విరమణ పొందారు. ‘‘అంపశయ్య’’, ‘‘ముళ్లపొదలు’’, ‘‘అంతస్రవంతి’’ నవలల్ని రచించారు. నవీన్‌ రాసిన కొన్ని కథలు హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిళం, మరాఠి భాషల్లోకి అనువాదమయ్యాయి. వీరు రాసిన ‘‘కాలరేఖలు’’ నవల 1944 నుంచి1995 మధ్య కాలంలోని తెలంగాణ ప్రాంత సంస్కృతి, సామాజిక, రాజకీయ జీవితానికి అద్దం పడుతుంది. ఈ రచనకు 2004లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అదే ఏడాది కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు అందుకున్నారు.

ఉత్తరాంధ్ర కథకుడు అట్టాడ అప్పల నాయుడు
ఉత్తరాంధ్రంలోని అట్టడుగు జీవితాలను అక్షరీకరిస్తున్న ప్రముఖ కథకుల్లో అట్టాడ అప్పలనాయుడు ముఖ్యులు. ఆయన సొంతూరు విజయనగరం జిల్లా కొమరాడ మండలం గుమడ గ్రామం. యుక్త వయస్సులో శ్రీకాకుళ పోరాటంవైపు ఆకర్షితుడైన అప్పలనాయుడు కొంత కాలం ప్రజానాట్యమండలిలో పనిచేశారు. నిర్మాణరంగ కూలీగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగిగా ఉన్నాడు. మిత్రులతో కలిసి ‘‘శ్రీకాకుళ సాహితీ’’ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ తరపున ‘‘నాగావళి కథలు’’, ‘‘వంశథార కథలు’’, ‘‘జంఝావతి కథలు’’ వంటి పలు కథా సంకలనాలను ప్రచురించారు. ఇప్పటివరకు వీరు వందకు పైగా కథలు, నాలుగు నవలల్ని రచించారు. అప్పలనాయుడు రచించిన నాటకం ‘‘మడిసెక్క’’ అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. వీరి రచనలన్నింటినీ కలిపి ‘‘అట్టాడ అప్పల నాయుడు సాహిత్యం’’ పేరుతో మూడు సంపుటాలుగా వెలువరించారు. అధికార భాషా సంఘం పురస్కారం, రావి శాస్త్రి పురస్కారం వంటి పలు అవార్డులు అందుకున్నారు.

కొలకలూరి మధుజ్యోతి
కొలకలూరి మధుజ్యోతి తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ప్రముఖ సాహితీ దిగ్గజం ఆచార్య కొలకలూరి ఇనాక్‌ కూతురు కూడా. స్వస్థలం అనంతపురం. సమాజంలోని వివక్షలను, అణిచివేతలకు గురవుతున్న జీవిత కోణం మధుజ్యోతి రచనల్లో ప్రధానంగా కనపడుతుందని సాహిత్య విమర్శకుల అభిప్రాయం. ఇప్పటివరకు కథలు, జీవిత చరిత్రలు, విమర్శనా గ్రంథాలు మొత్తం 22 పుస్తకాలు రాశారు. కొలకలూరి ఇనాక్‌ జీవిత చరిత్ర ‘‘నాన్న’’, ‘‘గుర్రం జాషువా జీవిత చరిత్ర’’, ‘‘కుసుమ ధర్మన్న జీవితం’’ వంటివి వీరి ప్రసిద్ధ రచనలు. ‘‘దళిత సౌందర్య సాహిత్యతత్వం’’, ‘‘స్త్రీవాద సాహిత్యం సామాజిక అవసరం’’, ‘‘ఆధునిక తెలుగు సాహిత్యం దళిత సంస్కృతి’’, ‘‘తెలుగు సాహితీ వస్తు పరిణామాలు’’ ప్రధాన రచనలు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జాషువా పురస్కారంతోపాటు, సావిత్రీబాయి ఫూలే అవార్డును అందుకున్నారు.