భూములను ఇప్పటికయినా  రీసెటిల్‌మెంట్‌ సర్వే చేయించి యజమానులకు సరైన రక్షణ కల్పించకపోతే భూతగాదాలు మరింతగా పెరిగిపోతాయి. రీ సర్వే ద్వారా వారి భూములు ఖచ్చితంగా నిర్థారణ కాగలవంటే యజమానులు కొంత ఆర్థికంగా భరించడానికి సిద్ధంగా ఉంటారు. పూర్వంలాగా పన్నులు చెల్లించడానికి కూడా సిద్ధపడతారు. రీసెటిల్‌మెంట్‌ జరుగకపోతే గ్రామ అవసరాలకు ఉపయోగించుకోవాల్సిన ప్రభుత్వ భూములూ మిగలమిగలవు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాధికార్ల వ్యవస్థ 1984లో రద్దయింది. ఈ మార్పుకు ప్రజలు సంతోషించారు. తమను పీల్చి పిప్పిచేస్తున్న గ్రామాధికార్ల పీడ విరగడైందని పండుగ చేసుకొన్నారు. మొత్తానికి కొందరు గ్రామాధికార్లు చేసిన దౌర్జన్యాలకు గ్రామాధికార్ల వ్యవస్థ బలయింది. ఆనాడు గ్రామాధికార్లకు ఎన్నో బాధ్యతలుండేవి. ప్రతి సంవత్సరం ప్రతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి పంట నమోదు చేయాలి. ప్రభుత్వ భూములను సాగుచేసుకుంటున్న వారి వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలి. వర్షపాతం, మనుషుల, పశువుల ఆరోగ్య పరిస్థితులు, పంటల పరిస్థితి, జనన మరణాలు, సాగు చేసిన విస్తీర్ణం ప్రతినెలా 20వ తేదీలోగా విధిగా తహశీల్దార్‌ కార్యాలయానికి పంపాలి.

ఆనాడు తహశీల్దారును కలిసేవారు అరుదు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లంటేనే భయం.
గ్రామాధికార్ల రికార్డుల్లో ఏదైనా పంట నమోదులో తేడాలుంటే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు తహశీల్‌దారుకు ఫిర్యాదు చేసేవారు. ‘చపామణి’ అనే కేసు నమోదు చేసేవారు. వెంటనే గ్రామాధికారికి మెమోలు జారీ అయ్యేవి. మెమోకు సరైన సంజాయిషీ ఇవ్వకుండా, చిన్న పొరపాటును మన్నించమని కోరినా వినేవారు కాదు. సస్పెన్షనుకు గురిజేసేవారు.
గ్రామాల్లో భూములు కలిగి ఉద్యోగరీత్యానో, మరే ఇతర కారణాలవల్లనో దూరంగా నివసిస్తూ వున్నా వారి భూములకు ఎంతో రక్షణ ఉండేది. ఆక్రమణలు చేయాలంటే ఎంతో భయం. ముఖ్యంగా శిస్తు వసూలు చేయడంలో కఠినంగా ఉండేవారు. శిస్తు కట్టడమంటే రైతులు ఎంతో పౌరుషంగా భావించేవారు. శిస్తు చెల్లించడం ఎద్దుకు మొగతాడుతో సమానం అనేవారు.
 
జమాబందీ వచ్చిందంటే నెల రోజుల పాటు రికార్డులతో కుస్తీ పడాల్సిందే. రికార్డులన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఒక్క రూపాయి తేడా వచ్చినా, ఒక సెంటు భూమి తేడా వచ్చినా కరణం ఇబ్బందుల్లో పడినట్టే. రెవిన్యూ ఇన్‌స్పెక్టరు, ప్రధాన గుమాస్తా, ఉప తహశీల్దారు, తహశీల్దారు రికార్డులను రంధ్రాన్వేషణ చేసి పరిశీలించేవారు. సంవత్సరానికొకసారి జరిగే జమాబందిని రెవెన్యూ డిజనల్‌ అధికార్లు, కలెక్టర్లు నిర్వహించేవారు. ప్రతి వ్యవసాయ కమతం సరిహద్దు రాళ్లను సిబ్బంది పరిశీలించేవారు. అసలు జమాబంది అంటేనే గ్రామాధికార్లకు వెన్నులో భయం పుట్టేది.
భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి సర్వే చేయించుకొని ఖచ్చితమైన విస్తీర్ణం ఉండాలన్న ఖచ్చితమైన నిబంధనలు లేకపోవడం వల్ల చెక్కుబందీలు ఉంటే చాలు, విస్తీర్ణం అందాజుగా వేసినా రిజిస్ర్టేషన్లు జరిగేవి. అలా చేయించుకున్న రెండు, మూడు రిజిస్ర్టేషన్ల వల్ల ఒక సర్వే నెంబరులోని భూమి వాస్తవ విస్తీర్ణానికి మించి ఉండేది. ఆనాడే గ్రామాధికార్ల సంఘం భూమి రీసెటిల్‌మెంట్‌ సర్వే గురించి పలుసార్లు ప్రభుత్వ దృష్టికి తెచ్చింది. అయితే ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల భూతగాదాలు మొదలయ్యాయి. ఆనాడు గ్రామాధికార్లు గ్రామాల్లోనే నివసించడం వల్ల ఎక్కడైనా ఎవ్వరికైనా అన్యాయం జరిగితే గ్రామాధికార్లు ఎదిరించి బాధితులకు న్యాయం చేసేవారు. ముఖ్యంగా గ్రామాల్లో ఆధిపత్యం కలవారితోనే సమస్యలు ఉండేవి. గ్రామాధికార్ల వ్యవస్థ రద్దు కావడంతో పిల్లలను కూడా చదివించుకోలేని పరిస్థితుల్లోకి గ్రామాధికార్లు నెట్టబడ్డారు. కుటుంబ జీవనం కూడా జరగని దుర్భరపరిస్థితుల్లోకి కొన్ని కుటుంబాలు నెట్టబడ్డాయి.
 
గ్రామాధికార్ల వ్యవస్థ రద్దు తర్వాత విద్యార్హత కలిగిన గ్రామాధికార్లను గ్రామ సహాయకులుగా నియమించారు. వారసత్వంగా సంక్రమించిన అనుభవంతో ఎక్కడో ఊరుకాని ఊర్లో మంచి పేరు సంపాదించుకోవాలన్న పట్టుదలతో పనిచేసి ఎన్నో సమస్యలను పరిష్కరించారు. ఎన్నోళ్లుగా పేరుకుపోయిన బకాయి శిస్తు పన్నును వసూలు చేశారు. ఆ తరువాత గ్రామ రెవిన్యూ అధికారులుగా, గ్రామ రెవిన్యూ సహాయకులుగా వచ్చినవారు సరైన అనుభవం, శిక్షణ లేకపోవడం వల్ల, రాజకీయ నాయకుల ప్రాబల్యం పెరిగి గ్రామీణ వ్యవస్థ పట్టుదప్పింది. ఫలితంగా ఎన్నో భూ ఆక్రమణలు జరిగాయి. చివరికి గ్రామ అవసరాల కోసం కేటాయించిన భూములను ఆక్రమించుకున్నారు. ముఖ్యంగా నగరాల్లో కష్టపడి గ్రామాల్లో సంపాదించిన ఇంటిస్థలాలను యజమానులు ఎక్కడో దూరంగా ఉండడాన్ని అవకాశంగా తీసుకొని, దొంగ హక్కులు సృష్టించి కైవసం చేసుకొన్నారు. సర్వే నెంబర్‌ చూపించి, మరొక చోట స్థలాలను రిజిష్టరు చేయించుకొన్నారు.
ఇప్పటికైనా రీసెటిల్‌మెంట్‌ సర్వే చేయించి యజమానులకు సరైన రక్షణ కల్పించకపోతే భూతగాదాలు మరింతగా పెరిగిపోతాయి. రీసర్వే ద్వారా వారి భూములు ఖచ్చితంగా నిర్థారణ కాగలవంటే యజమానులు కొంత ఆర్థికంగా భరించడానికి సిద్ధంగా ఉంటారు. పూర్వంలాగా పన్నులు చెల్లించడానికి కూడా సిద్ధపడతారు. రీసెటిల్‌మెంట్‌ జరుగకపోతే గ్రామ అవసరాలకు ఉపయోగించుకోవాల్సిన ప్రభుత్వ భూములు కూడా మిగలవు. బలవంతునిదే రాజ్యమవుతుంది.
 – టి. జయచంద్రరావు