నటి శ్రీరెడ్డి మీద నిషేదంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) వెనక్కి తగ్గింది.  కొద్ది రోజులు క్రితం ఫిల్మ్ చాంబర్‌లో మా సభ్యత్వం ఇవ్వకపోవడాన్ని, క్యాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా శ్రీరెడ్డి అర్ధనగ్నంగా నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ‘మా’ శ్రీరెడ్డిపై నిషేదం విధించింది.
అంతేకాదు ఆమెతో ఏ ఆర్టిస్ట్ నటించడానికి వీల్లేదని ఖరాకండిగా తేల్చిచెప్పింది. అయితే గురువారం సాయంత్రం శ్రీరెడ్డిపై నిషేదం ఎత్తివేస్తున్నట్లు ‘మా’ ప్రకటించింది. మొత్తానికి చూస్తే శ్రీరెడ్డికి ఇదో శుభవార్త అని చెప్పుకోవచ్చు.
 
ఈ సందర్భంగా మా అధ్యక్షుడు శివాజీరాజా మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరెడ్డిపై నిషేధాన్ని పునః పరిశీలించాలని నటులు కోరడంతో ఆమెపై నిషేదం ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేశారు. ‘మా’ కుటుంబంలో ఒక వ్యక్తి. చిన్న తప్పు చేసింది కదా అని మేం తగులబెట్టుకోము. ఫిల్మ్ చాంబర్‌లో శ్రీరెడ్డి చేసిన పనికి మేం మనస్తాపం చెందాం అంతే గానీ.. మరో ఉద్దేశం మాకు లేదు. ఈ క్షణం నుంచి తెలుగు ఇండస్ట్రీలోని 900మంది ఆర్టిస్టులు శ్రీరెడ్డితో నటించడానికి రెడీగా ఉన్నారు. అలాగే ఆ అమ్మాయి కూడా సినిమాలపై ఏకాగ్రత పెట్టాలని కోరుకుంటున్నాను. ఇందుకు ఏ సహాయం కావాలన్నా చేసేందుకు మేం సిద్దం. సాయం కావాలని ఎవరడిగినా నేను వెనుకాడలేదు. శ్రీరెడ్డి విషయంలో కూడా అంతే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అవకాశాలిప్పించదు. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మాత్రమే అవకాశాలిస్తారు అని శివాజీరాజా స్పష్టం చేశారు.
తెలుగు సినీ ప‌రిశ్రమ‌కు చెందిన ఫిలిం ఛాంబ‌ర్, డైరెక్టర్స్ అసోసియేష‌న్, `మా` అసోసియేష‌న్ పెద్దలు వ‌ర్ధమాన న‌టి శ్రీరెడ్డి విష‌యాన్ని పున:ప‌రిశీలించ‌మ‌ని స‌ల‌హా ఇచ్చారని `మా` అధ్యక్షుడు శివాజీ రాజా గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన అత్యవ‌స‌ర మీడియా స‌మావేశంలో తెలిపారు. ఈ విష‌యాన్ని ప‌రిశీలించే వ‌ర‌కూ శ్రీరెడ్డితో ‘మా’ స‌భ్యులు యధాత‌ధంగా ప‌నిచేయ‌వ‌చ్చని శివాజీ రాజా ప్రక‌టించారు. అలాగే ‘మా’ లో స‌భ్యత్వ విష‌య‌మై క‌మిటీ స‌భ్యులు, మెంబ‌ర్లంతా స‌మావేశం ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకుంటామ‌ని తెలిపారు.
ఇటీవ‌ల తెలుగు సినీ ప‌రిశ్రమ‌లో సెక్సువ‌ల్ హెరాస్‌మెంట్ మీద జ‌రుగుతోన్న విమ‌ర్శల ప‌రిణామాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ‌ర్ కామ‌ర్స్ వారు గ‌వ‌ర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ విష‌యంలో విశాఖ గైడ్ లైన్స్ పేరుతో ఇచ్చిన గైడ్ లైన్స్ ఆధారంగా ఓ కమిటీని ఏర్పాటు చేయాల‌ని దీనిలో సినీ ప‌రిశ్రమ‌కు చెందిన నిర్మాత‌లు, ద‌ర్శకులు, న‌టీన‌టులు, ఫెడ‌రేష‌న్ మెంబ‌ర్స్‌తో పాటు స‌మాజంలో ఉన్న అంద‌రి ప్రముఖులు (లాయ‌ర్లు, డాక్టర్లు, ప్రభుత్వాధికారులు) ఇందులో మెంబ‌ర్స్‌గా ఉంటార‌ని ఫిలిం ఛాంబ‌ర్ అధ్యక్షుడు పి. కిర‌ణ్ తెలిపారు. గ‌వ‌ర్నమెంట్ వారి గైడ్ లైన్స్ ప్రకారం ప్రతీ ప్రొడ‌క్షన్ కంపెనీలో లైంగిక వేధింపుల నియంత్రణ కోసం క్యాష్‌(కమిటీ అగైనెస్ట్‌ సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌) ఉండి తీరాల‌ని, క్యాష్ క‌మిటీని ఏర్పాటు చేసేలా ఫిల్మ్ ఛాంబ‌ర్ బాధ్యత తీసుకుంటుంద‌ని ఛాంబ‌ర్ అధ్యక్షుడు పి. కిర‌ణ్ తెలిపారు.