కథువాతోపాటు దేశంలో బాలికలపై సాగుతున్న అత్యాచారాలపై  కేంద్రమంత్రి మేనకా గాంధి  సంచలన ప్రకటన చేశారు.

 

పన్నెండేళ్ల లోపు బాలికలపై అత్యాచారం చేస్తే…దోషులకు మరణదండన విధించేలా చట్టాన్ని సవరించేందుకు కేంద్రం నిర్ణయించినట్లు కేంద్ర మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి మేనకా గాంధి  వెల్లడించారు. ఇటీవల జరిగిన కథువా ఘటనతోపాటు బాలికలపై సాగుతున్న అత్యాచార పర్వాలపై తాను కలత చెందానని మనేకాగాంధీ శుక్రవారం వ్యాఖ్యానించారు. బాలల అత్యాచార నిరోధక చట్టాన్ని (పోస్కో) సవరించాలని యోచిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కథువా దేవాలయంలో ఎనిమిదేళ్ల బాలికను నిర్బంధించి సామూహిక అత్యాచారం చేసిన ఘటనను మంత్రి ప్రస్తావించారు.

సుప్రీం కోర్టు సంసిద్ధత

ఎనిమిదేళ్ళ కశ్మీరు బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సంసిద్ధత వ్యక్తం చేసింది. కథువాలో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వివరాలను లిఖితపూర్వకంగా న్యాయవాదులు సమర్పిస్తే విచారణకు సిద్ధమేనని ప్రకటించింది. నిందితులపై అభియోగ పత్రం నమోదును నిరోధించేందుకు జమ్మూ-కశ్మీరులోని కథువా న్యాయవాదులు అడ్డుకున్నట్లు లిఖితపూర్వకంగా పేర్కొనాలని కోరింది. బాధితురాలి కుటుంబం తరపున వాదనలు వినిపించేందుకు ముందుకొచ్చిన న్యాయవాదులను కథువా న్యాయవాదులు బెదిరించినట్లు కూడా రాతపూర్వకంగా తెలియజేయాలని కోరింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏ ఎం ఖన్విల్కర్, జస్టిస్ డీ వై చంద్రచూడ్ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు న్యాయవాదులు కొందరు శుక్రవారం ఆశ్రయించారు. కథువా రేప్, మర్డర్ కేసుపై స్వీయ విచారణ జరపాలని కోరారు. ఈ కేసు వివరాలను లిఖితపూర్వకంగా తాము సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసుపై విచారణ జరిపేందుకు ముందుకొచ్చింది.

” నా బిడ్డ ఇంకా కళ్లలోనే మెదులుతోంది..’’

‘‘నా బిడ్డ రోజూ గుర్తొస్తోంది… ఆమె ఎక్కడుందోనని నా కళ్లు ఇంకా వెతుకుతూనే ఉన్నాయి…’’ అంటూ కతువా అత్యాచార బాధితురాలి తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఏడాది జనవరిలో జమ్మూ కశ్మీర్‌లోని కతువాలో కొందరు మానవ మృగాలు ఎనిమిదేళ్ల బాలికను అపహరించి అత్యాచారం చేసి చంపేసిన సంగతి తెలిసిందే. తన కుమార్తెకు జరిగిన దారుణంపై న్యాయంచేయాలనీ, నిందితులను ఉరితీయాలని కోరుతూ ఆమె తండ్రి కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. ‘‘నా కుమార్తెను చిత్రహింసలు పెట్టి చంపిన వారిని ఉరితీయాల్సిందే…’’ అంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు.

కాగా జమ్మూ కశ్మీర్ పోలీసులు కతువా రేప్ కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తూ జమ్మూ బార్ అసోసియేషన్ మంగళవారం సమ్మెకు పిలుపునిచ్చింది. ఆ రోజు నుంచి బాధితురాలి తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుని పశువులతో సహా ఊరి విడిచి వెళ్లిపోయారు. జనవరి 10న కతువాలోని బకర్వాల్ వర్గానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక తమ గుర్రాలను మేపుతుండగా దుండగులు కిడ్నాప్ చేశారు. సంజీరామ్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న ఓ గుడిలో చిన్నారిని నిర్బంధించారు. మత్తుమందు ఇచ్చి నాలుగు రోజుల పాటు అత్యాచారం జరిపి దారుణంగా కొట్టిచంపారు. ఈ దారుణంపై ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్టు చేశారు.