తిరిగే కాలు, తిట్టే నోరు ఊరుకోదంటారు…ఆయన మనసులోని మాట దాగదు, నిర్మోహమాటంగా మాట్లాడే మనస్థత్వం ఆయనది. అది స్వపక్షమైనా…విపక్షమైనా….మాట తీరు మాత్రం అంతే ఉంటుంది. పాలన గురించి ప్రజలేమనుకుంటున్నారో ప్రభువులు తెలుసుకోవాలనుకుంటారు. ఆ అవకాశం లేని వారికి క్షేత్ర స్థాయి పరిస్థితిని వివరించడమే ప్రజాప్రతినిధుల ప్రధమ కర్తవ్యం. అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి తన మనసులోని మాటను చంద్రబాబుకు చెప్పారు. అది కూడా నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా చంద్రబాబుకు చెప్పిన విషయాలు ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి.


అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మనసులో ఏదీ దాచుకోవడం లేదు.. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తున్నారు. ఆయన స్వభావమే అంత! ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర కూడా తన అంతరంగాన్ని ఆవిష్కరించారు జేసీ. ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించి జాతీయస్థాయిలో వార్తల్లోకి ఎక్కిన తెలుగుదేశంపార్టీ ఎంపీలు నియోజకవర్గాలకు బయలుదేరి వచ్చారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి నేరుగా రాజధాని అమరావతికి వచ్చారు. చంద్రబాబును కలుసుకున్నారు. ఆయనతో దాదాపు అరగంటసేపు ఏకాంతంగా భేటి అయ్యారు. బస్సు యాత్ర పేరుతో జిల్లా కేంద్రాలకు ఎంపీలను తీసుకువెళితే బాగోదని…మనం దృష్టి కేంద్రీకరించిన అంశం ప్రజల్లోకి వెళ్లే అవకాశం లేదని నిర్మోహమాటంగా చెప్పారు. అలా కాకుండా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామాలకు వెళితే బాగుంటుందని సూచించారు. ఇంటింటికీ తెలుగుదేశం మాదిరిగా గ్రామాలలోకి వెళ్లాలనే సలహా ఇచ్చారు జేసీ . ఒకవేళ బస్సు యాత్రను నిర్వహించినా.. ఈ కార్యక్రమాన్ని కూడా చేపడితే బాగుంటుందేమో ఆలోచించాలని ముఖ్యమంత్రికి జేసీ వివరించారు.

మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని.. ప్రతిరోజూ ఏదో ఒక పని చేయమని అనడం.. బయోమెట్రిక్‌ అడెండెన్స్‌.. ఇలాంటివి వారికి కంటగింపుగా మారాయని సీఎంకు దివాకర్‌రెడ్డి చెప్పారట! 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చినప్పటికీ వారు సంతృప్తి చెందకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఎంపీ విశ్లేషించారట! దీంతో పాటు రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లోనూ.. వివిధ శాఖల్లోనూ అవినీతి ఎక్కువగా ఉందని .. ఎమ్మార్వో కార్యాలయాలలో డబ్బు ఇవ్వందే పనులు జరగడం లేదని…జనం కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని చెప్పుకొచ్చారు.

అక్కడితో ఆగకుండా రాజకీయ పరిణామాలను కూడా విశ్లేషించారు జేసీ.. పవన్‌కల్యాణ్‌.. జగన్మోహన్‌రెడ్డిలను కలిపేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదన్నారు. ఇద్దరిని కలిపి ఎన్నికలలో పోటీ చేయిస్తే టీడీపీ ఓడిపోతుందనేది నరేంద్రమోదీ వ్యూహం కావచ్చని అన్నారు. జగన్‌, పవన్‌లు చెరో సగం సీట్లకు పోటీ చేసే అవకాశం ఉందని.. ఒకవేళ గెలిస్తే ముఖ్యమంత్రి పదవిని కూడా చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని చూస్తున్నారని జేసీ వివరించారు. అయితే ఈ ప్రతిపాదనకు జగన్మోహన్‌రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరని కొంతమంది టీడీపీ నేతల దగ్గర జేసీ వ్యాఖ్యానించారు. గోద్రా సంఘటన అనంతరం గుజరాత్‌ జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకునే నరేంద్రమోదీకి చంద్రబాబు ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పిన జేసీ… ఆ విషయాన్ని మోదీ మనసులో పెట్టుకున్నారని అన్నారు.. ఆ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సాయం చేయడం లేదని చెప్పారు. చంద్రబాబుకు నిధులు పుష్కలంగా ఉంటే అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ ఏనాడో గుజరాత్‌ను మించిపోయేదని జేసీ వ్యాఖ్యానించారు. సహజ వనరులు పుష్కలంగా ఉన్న ఏపీ దేశంలో నంబర్‌వన్‌ రాష్ట్రమయ్యేదన్నారు.

ఇవన్నీ చంద్రబాబుకు చెబుతూనే.. ఇకనుంచి పార్టీపై దృష్టి పెట్టాల్సిందిగా సూచించారు. ఎన్నికల వరకు ఇదే టెంపోను కొనసాగించాలని జేసీ కోరారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, జనసేన, కాంగ్రెస్‌, బీజేపీలు విడివిడిగా పోటీ చేస్తే తమకు కలిసివస్తుందని జేసీ విశ్లేషించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి అధికారపక్షానికి అడ్వాంటేజ్‌ అవుతుందన్నారు. ఇక శాఖాపరమైన సమీక్షలతో కాలం గడపకుండా పార్టీ కోసం సమయం కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సలహా ఇచ్చారు. నియోజకవర్గాలలో ఉన్న చిన్న చిన్న విబేధాలను పరిష్కరించడంతో పాటు, అభ్యర్థుల గుణగణాలను, ఎంపికపై కసరత్తు నిర్వహించాలన్నారు. కార్యకర్తలను ఎన్నికల దిశగా నడిపించాలని సలహా ఇచ్చారు. చంద్రబాబుతో జరిగిన భేటీలో అన్ని విషయాలు నిర్మొహమాటంగా చెప్పి వచ్చానని అంటూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు జేసీ. అధినేతలకు క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించడం తన ధర్మమని.. ఆయన చెప్పినవి చక్కగా వింటారని జేసీ వ్యాఖ్యానించారు.. తాను చెప్పిన సలహాలను ఆచరణలో పెడతారనే నమ్మకం తనకుందని దివాకర్ రెడ్డి ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యానించారు.