నవ్యాంధ్రకు సహాయ నిరాకరణ
రాష్ట్రం ఆశలు అడియాశలు చేశారు
నాలుగేళ్లు వేచిచూసి విసిగిపోయాం
గుజరాత్‌లో విగ్రహానికి 2500 కోట్లు
అమరావతి నిర్మాణానికి 1500 కోట్లేనా?
పార్లమెంటులో కుట్రతో అల్లరి చేయించారు
ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపాటు
సింగపూర్‌ టీడీపీ ఫోరం సభ్యులతో భేటీ

 


కేంద్ర ప్రభుత్వం నవ్యాంధ్ర అభివృద్ధికి మోకాలడ్డుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్రోశించారు. సహాయ నిరాకరణ చేస్తోందని మండిపడ్డారు. అయినప్పటికీ విభజించినవారే ఈర్ష్య చెందే రీతిలో కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. శుక్రవారం సింగపూర్‌ పర్యటనలో భాగంగా ఆయన అక్కడి తెలుగుదేశం ఫోరం సభ్యులతో సమావేశమయ్యారు. ‘‘కేంద్రం పైసా ఇవ్వకున్నా… మన కష్టంతో ముందుకెళ్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని చూసి వాళ్లు అసూయ, ఈర్ష్యకు గురయ్యారు. అయితే, కేంద్రం వైఖరి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా ఉంది. ప్రజలు అవమానానికి గురికాకూడదు’’ అని తెలిపారు. తాము అవిశ్వాస తీర్మానం నోటీసులిస్తే… అది చర్చకు రాకుండా బీజేపీ ఉద్దేశపూర్వకంగా, కుట్రతో లోక్‌సభలో అన్నా డీఎంకే సభ్యులతో అల్లరి చేయించిందన్నారు. పార్లమెంట్‌ను రెండు వారాలు నడవనీయకుండా బీజేపీ విజయం సాధించిందన్నారు. ‘‘మోదీ గుజరాత్‌లో ఒక విగ్రహం నెలకొల్పడానికి రూ.2500 కోట్ల వ్యయం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి మాత్రం 1500 కోట్లు ఇచ్చారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ కొత్తరాష్ట్రంగా మారింది. అన్నీ సమస్యలే. విభజన చట్టంపై రాజ్యసభలో గట్టిగా మాట్లాడారని, న్యాయం జరుగుతుందనే బీజేపీతో ఎన్నికల పొత్తు పెట్టుకున్నాం.

ఎన్నో ఆశలతో వారితో స్నేహంగా మెలిగితే ఆశలు అడియాశలు చేశారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి మకిలి అంటిన పార్టీలు, నేతలు మాత్రమే వారి నియంత్రణలో ఉంటారని బీజేపీ భావిస్తోందన్నారు. ప్రత్యేక హోదాను తుంగలో తొక్కారన్నారు. ఉమ్మడిగా పోటీ చేసి గెలిచాక ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీజేపీ వాగ్దాన భంగానికి పాల్పడిందని చెప్పారు. నాలుగేళ్లు, నాలుగు బడ్జెట్‌లు చూసి విసిగి వేసారిన తర్వాతే ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని చంద్రబాబు తెలిపారు.

బాండ్ల రూపంలో అండదండలు
రాజధాని అమరావతి నిర్మాణానికి బాండ్ల రూపంలో అండదండలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రికి సింగపూర్‌ తెలుగుదేశం ఫోరం సభ్యులు తెలిపారు. తెలుగు వారి రాజధానిని సొంత డబ్బులతో నిర్మించుకుందామని అన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ రాజధాని అమరావతి నిర్మాణానికి ఇతరుల వద్ద చేతులు చాచడం తనకూ ఇష్టం లేదని అన్నారు. రాష్ట్రం కోసం, రాష్ట్రంలోని పార్టీ కోసం కొంత సమయాన్ని వెచ్చించాలని కోరారు. సింగపూర్‌లో తెలుగు వారితో సమావేశం కావడం ఎంతో సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘‘పాతికేళ్ల కిందట సింగపూర్‌కు వచ్చినప్పుడు అంతా తమిళులే ఉండేవారు. అందుకు చారిత్రక కారణాలున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా వివిధ రంగాల్లో నిపుణులైన తెలుగువారు కనపడుతున్నారు’’ అని తెలిపారు. విదేశాల్లో స్థిరపడిన తెలుగువారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించడానికే ఏపీ ఎన్‌ఆర్టీని స్థాపించామని తెలిపారు. ఎన్‌ఆర్టీ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు.