కవుల తల్లులకు నమస్కారం

ఇంకా సరిగ్గా ఆకలైనా అయిండదు
అన్నం తినాలని ఏమూలో కడుపులోంచి ఒక ఆకలి పిలుపు
మెదడుకైనా చేరక ముందే.. అమ్మ పిలుపు !
“ ఆకలి కాలేదా? అన్నం తినలేదా?..” అని .
కలకత్తాలో ఉన్నా, విశాఖలో ఉన్నా, యానాంలో ఉన్నా,
చెన్నై, బెంగళూరు,విజయవాడలోనో, హైదరాబాద్ లోనో..
సముద్రాల పైనో, నది వొడ్డులోనో,ఒకానొక ద్వీపంలోనో ,
సమూహంతోనో, ఒంటరిగానో,
సంతోషాలతోనో-ఎడతెగని పనుల ఒత్తిళ్ళ మధ్యనో-
ఎక్కడుంటే ఏం? ఎవరితో వుంటే ఏం?
నా ఆకలి గురించి నా కన్నా ముందు ఆమె కెట్లా తెలిసిపోతుందో?
ఎంత గభాలున పళ్ళెంలో అన్నం పెట్టేదో?
ఇది వద్దమ్మా అనంటే-
చేతితడైనా ఆరకముందే మరొకటేదో క్షణాల్లో వండి పెట్టేది.
నడవడమే కాదు పరుగెత్తడమూ నేర్పింది ఆమే!
నడవడం నేర్పించిన వాళ్ళు- హమ్మయ్య నడుస్తున్నామని
మనం అనుకునే లోగా మనకు కనపడకుండా కనుమరుగైపోతారెందుకో?
మొన్న ఢిల్లీ లో , ఆ తర్వాత వారణాసిలో, మధ్యలో విశాఖలో ఉన్నప్పుడంతా ..
ఒక పిలుపేదో..గుండెను పిండేసేది.
నేను ,నా సహచరి,పిల్లలు ఆమెను,ఆమె ఎప్పుడూ మమ్మల్ని
పరస్పరం పలకరించుకునే సందర్భాలన్నీ ఏ మార్పూ లేకుండా
ఆమె లేకపోయినా.. ఇప్పుడూ రోజూ ఎదురవుతూనే వున్నాయి.
ఆమె గది,ఆమె మంచం,కంచం,చెప్పులు,కళ్ళజోడు,ఆమె పుస్తకాలు,
జపమాల,వక్కరోలు,ఆమె సెల్లు అన్నీ అట్లాగే వున్నాయి.
జీవితం,ప్రపంచం కూడా అట్లాగే వుంది.
ఆమె లేని శూన్యమే..ఉక్కిరిబిక్కిరి చేసి పొల మారేలా చేస్తోంది.
ఒక సంవత్సరం,మూడు నెల్లా,పద్నాలుగు రోజులుగా
ఆమె ఇప్పటికీ అన్నం తినే వేళల్లో అడుగుతూనే వుంది.
అన్ని ఆకలి వేళల్లో ఇప్పటికీ ఆమె
“ తిన్నారా ” అని అడుగుతూనే వుంది.
అన్నం కంచం ముందు కూర్చున్న ప్రతిసారీ
కంచంలో,అన్నంలో ఎందుకో
మా అమ్మే నాకు కనపడుతూ వుంటుంది ఇప్పటికీ !.
అమ్మల వద్ద కొంచెం ప్రేమగా
అన్నం తిన్న బిడ్డలందరూ కవులయ్యారేమో ?!
నాకు తెలియదు.

– పలమనేరు బాలాజీ
సెల్ : 9440995010