ఆరంభం అదిరింది. అభిమానం ఉప్పొంగింది. మునుపెన్నడూ లేనంత వైభోగం మహానాడులో చరిత్ర సృష్టించింది. కానూరు వీఆర్‌ సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైన మహానాడు అద్భుతాలకు నెలవైంది. ఎండను సైతం లెక్కచేయకుండా తరలివచ్చిన పసుపు దళం రికార్డుల వర్షం కురిపిస్తే, గంటా ఇరవై నిమిషాల పాటు సాగిన అధినేత అధ్యక్షోపన్యాసం భవిష్యత్తుపై ఆశలు రేపింది. ఉపన్యాసానికి ఉప్పొంగిన వేల గళాలు ఆద్యంతం జయజయధ్వానాలతో మద్దతు పలికాయి. మీ వెంటే మేమంటూ ప్రతి ఒక్కరూ ప్రతిస్పందించారు. ఆహా.. అనిపించిన ఆంధ్రా భోజనాలు, సంప్రదాయాన్ని చాటిన డ్వాక్రా బజార్లు, మహానటుడు ఎన్టీఆర్‌ ఫొటోలు, రక్తదాన శిబిరం మహోత్సవానికి మరింత కళను తెచ్చాయి.

కదలిరండి.. తెలుగుదేశ కార్యకర్తలారా.. త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా.. అనే… పిలుపునందుకుని పార్టీ శ్రేణులు కదం తొక్కారు. మహానాడుకు పసుపు దండు పోటెత్తింది! ప్రాంగణానికి చేరుకునే దారులు పసుపు వర్ణ శోభితమయ్యాయి. ఎన్టీఆర్‌ పుట్టిన గడ్డ.. కృష్ణాజిల్లాలో నాల్గవ సారి జరుగుతున్న మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలతో మహానాడు ప్రాంగణం పసుపుమయమైంది. ఆహ్వానితులు కుటుంబ సమేతంగా తరలి రావడంతో కోలాహలం నెలకొంది. దీంతో సిద్ధార్థ కళాశాలకు వెళ్లే ప్రధాన రోడ్లు కిక్కిరిసిపోయాయి. తొలిరోజే రికార్డు స్థాయిలో 32 వేల రిజిస్ర్టేషన్లు నమోదవడం విశేషం.

విజయవాడ: విజయవాడ వీఆర్‌ సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళా శాలలో ఆదివారం తెలుగుదేశం పార్టీ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. మహానాడుకు ఆతిథ్యం ఇస్తున్న ఇంజనీరింగ్‌ కళాశాలోని లక్ష చదరపు అడుగుల స్థలంలో మహానాడు ప్రాంగణానికి ఆహ్వానితులు, కార్యకర్తలు తమ కుటుంబాలతో సహా తరలి వచ్చారు. ఆదివారం సెలవు దినం కావటం వల్ల కూడా రికార్డు స్థాయిలో తరలి వచ్చారు. 35వ మహానాడులో రికార్డు స్థాయి లో 32వేల రిజిస్ర్టేషన్లు జరగడం విశేషం. ఇంతకుముందు జరిగిన మహానాడుల్లో సగటున తొలిరోజు 12 – 14 వేల రిజిస్ర్టేషన్‌ జరిగేది. దీనికి భిన్నంగా కృష్ణాజిల్లాలో 32 వేల రిజిస్ర్టేషన్‌ జరగటం విశేషం. మొత్తం 40 రిజిస్ర్టేషన్‌ కౌంటర్ల ఏర్పాటు చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు రిజిస్ర్టే షన్లు జరుగుతూనే ఉన్నాయి. మరో రికార్డు.. మహానాడులో మొత్తం 54 వేల మందికి పైగా భోజనాలను అందించటం. మహానాడు ప్రధాన ప్రాంగణంలో పదిహేను వేల మందికి సీటింగ్‌ ఏర్పాటు చేశారు.

చంద్రబాబునాయుడు ప్రసంగం వినటానికి ఎవరూ కూడా సీట్లలోంచి కదలలేదు. కొంతమందికి సీట్లు లేకపోయినా ప్రాంగణంలోకి వచ్చి బయటకు వచ్చారు. కళాశాల అడ్మి నిస్ర్టేటివ్‌ బిల్డింగ్‌ నుంచి బందరు రోడ్డు మీద ఉన్న కళాశాల ప్రధానద్వారం వరకు ఈ రో డ్డులో ఆహ్వానితులు, కార్యకర్తలు కిక్కిరిశారు. ఈ రోడ్డుకు రెండువైపులా దట్టమైన చెట్లు ఉండటంతో కార్యకర్తలు, ఆహ్వానితులు ఎక్కడా అసౌకర్యానికి గురి కాలేదు. చెట్ల నీడన కుర్చీల మీద కూర్చుని, రోడ్డు మీద నుంచుని మరీ మహానాడును వీక్షించారరు. దాదాపుగా గంటా ఇరవై నిమషాల పాటు జరిగిన అధినేత అధ్యక్షోపన్యాసాన్ని విన్న తర్వాతనే అక్కడి నుంచి ఆహ్వానితులు, కార్యకర్తలు కదలి భోజనాలను వెళ్లారు.

రక్తదానానికి మేము సైతం..
ఎన్‌టీఆర్‌ ట్రస్టు చేపడుతున్న సామాజిక కార్యక్రమాలకు చైతన్యం చెందిన ఎంతో మంది యువకులు భారీగా రక్తదానాలు ఇవ్వటానికి ముందుకు వచ్చారు. ఎంతో మందికి ఎన్‌ టీఆర్‌ ట్రస్టు సంస్థ వైద్య సేవలు అందించింది. మహానాడు ప్రాంగణంలో పారిశుధ్యం భేషుగ్గా ఏర్పాట్లు చేపట్టారు. ఎక్కడా వచ్చిన వారు అసౌకర్యానికి గురి కాలేదు. వేలాదిగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి పుష్కలంగా మంచినీటి బాటిల్స్‌, మజ్జిగను అందించటంలో హెరిటేజ్‌ సంస్థ సమర్థవంతమైన సేవలను అందించింది. ఒకానొక దశలో మజ్జిగ ప్యాకెట్లు, వాటర్‌ బాటిల్స్‌ అయిపోవటంతో అరగంట వ్యవధిలోనే భారీ ఎత్తున లారీలలో ప్రాంగణానికి సరుకును తెప్పించి ఎక్కడా కొరత అన్నది లేకుండా చేసింది.
హస్త కళాఖండాల సమాహారం
హస్తకళాఖండాల సమాహారంగా మహానాడులోని డ్వాక్రా బజార్‌ ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా బజార్‌ను ప్రారంభించగానే సందర్శకులకు అనుమతి ఇచ్చారు. మహానాడుకు తరలి వచ్చిన వేలాదిమంది సందర్శకులు ఈ డ్వాక్రా బజార్‌ను సందర్శించి హస్త కళాఖండాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. డ్వాక్రా బజార్‌లో మొత్తం 23 స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. కృష్ణాజిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధానంగా డ్వాక్రా గ్రూపు సంఘాలు ఉత్పత్తి చేసే వాటినే ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. మంగళగిరి కో-ఆపరేటివ్‌ ప్రాజెక్టు సంస్థ పట్టు వస్ర్తాలు, కాటన్‌ డ్రెస్‌ మెటీరియల్స్‌ను అందుబాటులో ఉంచింది. అన్నింటికంటే ప్రత్యేకంగా గిరిజిన కో-ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ (జీసీసీ) ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్‌ ఆకట్టుకుంది.

చెమటోడ్చిన సీబీఎన్‌ ఆర్మీ
సీబీఎన్‌ ఆర్మీ తరపున ఐటీ విభాగపు వలంటీర్లు అందించిన సేవలు నిరుపమానమనే చెప్పాలి. వలంటీర్లు ప్రణాళికా బద్ధంగా వ్యవహరించారు. దీని కో-ఆర్డినేటర్‌ ఎం.బ్రహ్మం చక్కగా వలంటీర్ల చేత విధులు నిర్వహింపచేశారు. రిజిస్ర్టేషన్‌ కౌంటర్స్‌ దగ్గర కార్యకర్తలు పోటెత్తారు. అశేషంగా తరలి వచ్చిన ఆహ్వానితులు, కార్యకర్తలతో కౌంటర్లన్నీ క్షణం తెరిపి లేకుండా కిటకిటలాడాయి. ప్రతి కౌంటర్‌ దగ్గర ముగ్గురు సిబ్బంది విధులు నిర్వహించారు. ఆహ్వానితులు, కార్యకర్తల ఐడెంటిటీ కార్డులను స్కాన్‌ చేసే పరికరాన్ని ఒకరు పట్టుకున్నారు. మరొకరు వారి పేరును నోట్‌ చేసుకున్నారు. ఇంకొకరు ఫైల్‌ను కార్యకర్తలకు అందించారు. వలంటీర్‌ దగ్గర ఉన్న ఐడెంటిటీ కార్డ్‌ రీడర్‌ వెంటనే కార్డుకు ఉన్న చిప్‌ను స్కాన్‌ చేయటం ద్వారా అతను టీడీపీ కార్యకర్త అవునో కాదో దానిమీద డిస్‌ప్లే అవుతుంది. వెంటనే మరో కార్యకర్త ఆ కార్యకర్త పేరు రాసుకుంటున్నారు. వారి నుంచి రూ.100 స్వీకరిస్తారు. మరో కార్యకర్త ఫైల్‌ను అందిస్తున్నారు. ఈ ఫైల్‌లో టీడీపీ మహానాడు ముసాయిదా తీర్మానాల పుస్తకం, కరపత్రం, పసుపు కండువా, వంటివి ఉన్నాయి.

‘‘అదృశ్య’ నిఘా.. మూడంచెల భద్రత
మహానాడుకు పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఈసారి పోలీసులు విజిబుల్‌ పోలీసింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వలేదు. మఫ్టీలోనే ఎక్కువమందిని భద్రతకు నియమించారు. మహానాడు జరిగే ప్రాంగణం చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం 220 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రాంగణంలోనే 65 కెమెరాలతో నిఘా పెట్టారు. మహానాడు జరిగే ప్రాంతంతోపాటు, ఇతర ప్రదేశాలను కళాశాలలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పర్యవేక్షించారు. పోలీసు కమిషనర్‌ గౌతమ్‌సవాంగ్‌ ఈ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను పరిశీలించారు. దీనిని ఎంజీ రోడ్డులో ఉన్న ప్రధాన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేశారు. అనుమానితులను ఏరివేయడానికి ఫేసియల్‌ రికగ్జ్నైడ్‌ కెమెరాలను ఉపయోగించారు. డ్రోన్‌ కెమెరాలను ఉపయోగించారు. సంయుక్త కమిషనర్‌ టి.కాంతిరాణా, ఉపకమిషనర్‌-1 డాక్టర్‌ గజరావు భూపాల్‌ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా చిత్ర మాలిక
దాన వీర శూరకర్ణ.. డ్రైవర్‌రాముడు.. గజదొంగ.. గుండమ్మకథ.. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు ఎన్టీఆర్‌. చిత్రసీమ నుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన ఆయన ప్రతి అడుగూ ఒక సంచలనం. ఆయన నిర్వహించిన ప్రతి సభా ఒక ప్రభంజనం. ఈ ఘటనలన్నింటికి ప్రతిరూపాలుగా నిలుస్తున్నాయి ఆ చిత్రాలు. మహానాడులో ఎన్టీఆర్‌, చంద్రబాబు ఫొటోలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది. మహానాడుకు వచ్చే కార్యకర్తలు, నేతలు ఆయా ఫొటోలను తిలకిస్తూ గతాన్ని మననం చేసుకుంటున్నారు. తమకు నచ్చిన ఫొటోలను సెల్‌ఫోన్లలో బంధిస్తున్నారు. మరికొంతమంది వాటికి వీడియోలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్‌ నటించిన మొత్తం చిత్రాలన్నింటితో కలిపి ఆయన ఫొటోను ఏర్పాటు చేశారు. ఇది మొత్తం ప్రదర్శనలో ప్రత్యేకార్షణగా నిలుస్తోంది.

తండ్రీకొడుకుల కటౌట్లతో సెల్ఫీలు
మహానాడు ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన చంద్రబాబు, లోకేష్‌ కటౌట్ల వద్ద సెల్ఫీల సందడి ఎక్కువగా కనిపించింది. రిజిస్ట్రేషన్లు చేయించుకున్న తర్వాత ఫొటో ప్రదర్శనకు వెళ్లే మార్గంలో చిన్న పరిమాణంలో ఈ కటౌట్లను ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలు ఆ రెండింటి పక్కన నిలబడి సెల్ఫీలు తీసుకుని ఆనందాన్ని పొందారు.