రైతు సంక్షేమం కోసం కేంద్రం ముందుకు రావాలని, లేకుంటే రైతులు కేంద్రాన్ని క్షమించరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆదివారం మహానాడులో ‘ఆత్మహత్యల్లో అగ్రస్థానం-తెలంగాణ వ్యవసాయం, టీఆర్‌ఎ్‌సలో కొరవడిన సామాజిక న్యాయం’ అనే అంశాలపై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేసిన ప్రతిపాదనపై చంద్రబాబు మాట్లాడారు. నాగరిక సమాజంలో రైతు ఆత్మహత్య బాధాకరమన్నారు. గత కాంగ్రెస్‌ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో 24 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా వ్యవసాయంపై ఒక విధానం తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి ఉపయోగకరంగా మారిస్తే రైతులకు పెట్టుబడుల వ్యయం తగ్గుతుందని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ రైతులు సున్నితమైన వ్యవసాయం చేస్తుంటారన్నారు. తెలంగాణలో రైతుల సమస్యలపై తెలుగుదేశం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని చెప్పారు. నీరు-ప్రగతి కార్యక్రమంపై ప్రతి సోమవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. అంతకు ముందు తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదని ఆరోపించారు. టీడీపీ చొరవతో వ్యవసాయంపై దేశవ్యాప్తంగా ఒక చర్చ జరగాలన్నారు. ఈ ప్రతిపాదనను బలపరిచిన పార్టీ జాతీయ కార్యదర్శి కొత్తపల్లి దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ నకిలీ ఎరువులు విక్రయించిన వ్యాపారస్తులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ వదిలేశారని, వారిని పట్టుకున్న అధికారులను బదిలీ చేశారన్నారు. తెలంగాణలో టీడీపీ ప్రభుత్వం రావాలని, చంద్రబాబు నెలకు 4 రోజులు తెలంగాణ కోసం కేటాయిస్తే 9 నెలల్లో తెలంగాణలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తామన్నారు. 119 సీట్లలో పోటీచేస్తామని చెప్పారు. ఈ అంశంపై మహానాడులో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు. తెలంగాణ అసెంబ్లీపై టీడీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఎల్‌.రమణ అన్నారు.

 

దొంగ లెక్కల్లోనే అనుభవం
జగన్‌పై చంద్రబాబు ధ్వజం

వైసీపీ అనుభవం లేని పార్టీ. ఆ పార్టీ నాయకుడు అనుభవంలేని నేత. దొంగలెక్కలు రాసుకోవడం తప్ప అభివృద్ధి అంటే తెలీని వ్యక్తి. అలాంటి వ్యక్తి అదిస్తాను, ఇదిస్తాను, కనపడేదంతా ఇస్తా అంటాడు! ఎలా ఇస్తాడు. ఏం అనుభవం ఉంది? తెలుగుదేశానికి అనుభవం ఉన్న నాయకత్వం ఉంది. నేతలంతా ఒక సవాల్‌గా తీసుకుని ముందుకెళ్లాలి. మనం తప్ప మరొకరు అభివృద్ధి చేయలేరని ప్రజలు మనకు అధికారం అప్పగించారు. అధికారంలోకి రాగానే మనకున్న వనరుల ఆధారంగా ప్రణాళిక రచించాను. నాలుగేళ్లలో రాష్ట్రాన్ని ఒక స్థాయికి తెచ్చాం. వైఎస్‌ హయాంలో 24వేల మంది రైతులు ఆత్మహత్మలు చేసుకున్నారు. కరెంటు షాక్‌లు, రాత్రిపూట పాముకాటుతో మరింతమంది రైతులు చనిపోయారు. నాటి అవినీతి ఆనవాళ్లుగా వాన్‌పిక్‌, లేపాక్షి సెజ్‌లు ఇప్పటికీ ఉన్నాయి.
బీజేపీ నదుల అనుసంధానం అడ్రస్‌ లేదు

బీజేపీ నదుల అనుసంధానం అంది. కానీ… దాని అడ్రస్సే లేదు. ఏపీలో మాత్రం దేశంలో తొలిసారిగా నదుల అనుసంధానం చేశాం. పోలవరం పనులు 54 శాతం పనులయ్యాయి. చేసిన పనికి కేంద్రం ఇంకా మూడువేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. పోలవరం పూర్తిచేయడం నా జీవితాశయం. రాష్ట్రంలో తాగు, సాగు, పరిశ్రమలకు నీటి కొరత లేకుండా చేస్తాం. మూడు, నాలుగేళ్లు కష్టపడితే అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి. గోదావరి-పెన్నా అనుసంధానమొక్కటే మిగులుతుంది. అదీ పూర్తి చేస్తాం.

ఈ నాలుగేళ్లలో మీరూ… మేమూ
బీజేపీ నాయకులు ఏవో విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికి మీరు కేంద్రంలో నాలుగేళ్లు, మేం రాష్ట్రంలో నాలుగేళ్లు పాలించాం. మీరు సహకరించకున్నా అభివృద్ధి చేసుకుంటూ మీపై పోరాడుతున్నాం. కానీ మీరేం చేశారు? జాతీయ స్థాయిలో 10.5 శాతం వృద్ధి రేటు సాధించినా… దక్షిణ భారతదేశంలో వెనకబడే ఉన్నాం. ఈ వెనుకబాటుకు కారణం మేం కాదు. మీరు చూపించిన వివక్ష. 29సార్లు ఢిల్లీ వచ్చి కోరినా న్యాయం చేయలేదు. దేశ రాజకీయాలను మార్చే శక్తి తెలుగుదేశానికి ఉంది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు! దీనికి తెలంగాణ కూడా మద్దతిచ్చే పరిస్థితికి వచ్చారు. ఎవరికీ ప్రత్యేక హోదా ఇవ్వం… అంటూనే 11 రాష్ట్రాలకు కొనసాగిస్తున్నారు. అన్యాయానికి అడ్డదారులు వెతుక్కునే పరిస్థితిలో ఉన్నారు.

కేంద్రానికి సహకరిస్తే రాష్ట్ర ద్రోహులే…
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు! దానిని కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే! సాక్షాత్తూ అప్పటి ప్రధాని, అనంతరం ప్రస్తుత ప్రధాని చెప్పిన మాటలకు విలువ లేకపోలే ఎలా? రాష్ర్టానికి న్యాయం చేయకపోయినా, మనపై కర్రపెత్తనం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. అలాగే బెదిరిస్తే ప్రజలు భయపడతారనుకుంటోంది. కానీ వారి ఆటలు ఇక్కడ సాగవు. మనం తమిళనాడు నుంచి నేర్చుకోవాలి. అక్కడ సినిమా వాళ్లు, ప్రజలు కలిసికట్టుగా పోరాడి తాము అనుకున్నది సాధించుకుంటారు. మనకు కేంద్రం ఇంత అన్యాయం చేసిన తర్వాత… మనం పోరాడలేమా? రోషం లేదా? ఇప్పుడు కేంద్రానికి సహకరించిన వారు రాష్ట్ర ద్రోహులే!

మనం ఎందుకు పన్నులు కట్టాలి?
మన రాజధాని అమరావతికి నిధులు ఇవ్వనప్పుడు మనమెందుకు కేంద్రానికి పన్నులు కట్టాలి? అమరావతి నిర్మాణం పూర్తయ్యాక దానివల్ల కేంద్రానికే ఎక్కువ పన్నులు వెళ్తాయి. అలాంటి రాజధాని నిధులు ఇవ్వడం లేదని అన్నారు. కష్టం మాది, సోకు మీదా? మా కష్టార్జితాన్ని మీకెందుకు పన్నులుగా కట్టాలి? పెత్తనం మాత్రమే చేస్తాం, బాధ్యత తీసుకోం అంటే ఎలా?

ఆ బాధ ఉంది…
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో ఉదయం నుంచీ సాయంత్రం వరకు ప్రతి ఒక్కరినీ కలిసేవాడిని. ఇప్పుడు నిద్రపోయే సమయంతప్ప రోజంతా రాష్ట్రం కోసం గడుపుతున్నాను. దీనివల్ల కార్యకర్తలకు సమయం ఇవ్వలేకపోతున్నాననే బాధ ఉంది. మున్ముందు దీనిని సమన్వయం చేసుకుంటాను. తెలుగుదేశాన్ని గెలిపించే సత్తా కార్యకర్తలకే ఉంది. నేతలను ఒకటే కోరుతున్నాను. మీరంతా కార్యకర్తలతో మమేకం కావాలి. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం. ఏపీలో 60లక్షల మంది, తెలంగాణలో 10లక్షల మంది సుశిక్షితులైన కార్యకర్తల సైన్యం ఉంది. ఇంతటి సైన్యం దేశంలో ఏ పార్టీకీ లేదు. కార్యకర్తలందరికీ పాదాభివందనం చేస్తున్నా.