వెండితెరపై ఎదురులేని హీరోగా.. ముఖ్యమంత్రిగా, నేషనల్‌ ఫ్రంట్‌ చైర్మన్‌గా భాగ్యనగరం నుంచి న్యూఢిల్లీ వరకు తిరుగులేని రాజకీయాలు నడిపారు నందమూరి తారక రామారావు. సాంఘిక, పౌరాణిక, చారిత్రాత్మక కథనాల చలన చిత్రాలకు ఆయనే గీటురాయి. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేశారు ఎన్టీఆర్‌. రాజకీయ రంగంలోనూ విభిన్న ప్రయాణం చేశారు. పేదలకు రూ. 2కే కిలో బియాన్ని ఇచ్చి ఆపన్నులపాలిట అన్నదాతయ్యారు. తెలుగు ప్రజల మదిలో ఆరాధ్యదైవంగా నిలిచారు.

గుడివాడ : జిల్లాలోని నిమ్మకూరులో 1923 మే 28న నందమూరి లక్ష్మయ్యచౌదరి, వెంకట్రావమ్మ దంపతులకు జన్మించారు ఎన్టీ రామారావు. విజయవాడ మున్సిపల్‌ హైస్కూల్‌లో పాఠశాల విద్యనభ్యసించి ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజిలో చేరారు. అక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగాధిపతిగా ఉన్నారు. నాటకంలో ఆడవేషం వేసేందుకు ఎన్టీఆర్‌ మీసాలు తీయాల్సి వచ్చినప్పుడు ససేమిరా అనడంతో మీసాలతోనే స్ర్తీ పాత్ర పోషించారు. దీంతో ఆయనకు మీసాల నాగమ్మ అనే పేరు తగిలించారు. మేనమామ కుమార్తె బసవరామతారకాన్ని 1942 మేలో పెళ్ళి చేసుకున్నారు. ఆయనకు 11మంది సంతానం. ఏడుగురు కుమారులు, నలుగురు ఆడపిల్లలు. ఆంధ్ర క్రిస్టియన్‌ కళాశాలలో చేరి అక్కడ నాటక సంఘాల కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆ సమయంలోనే ఆయన ఎన్‌ఏటీ అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కాముల, నాగభూషణం, కేవీఎస్‌ శర్మ తదితరులతో కలిసి రంగ స్థల నటుడిగా నాటకాలు వేశారు.

ఉద్యోగిగా..
ఎన్టీఆర్‌ 1947లో పట్టభధ్రుడై మద్రాసు సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష రాశారు. 1100 మంది రాయగా ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడిగా ఎన్టీఆర్‌ నిలిచారు. దీంతో మంగళగిరిలో సబ్‌ రిజిస్ర్టార్‌ ఉద్యోగం లభించింది. సినిమాలో చేరాలనే ఆశ ఆయన ఉద్యోగంలో నిలువనీయలేదు. ఆయన మూడు వారాల కంటే ఎక్కువ విధులు నిర్వహించలేకపోయారు. ప్రముఖ నిర్మాత బి.ఎ. సుబ్బారావు ఎన్టీఆర్‌ ఫొటోను చూసి మద్రాసు పిలిపించి పల్లెటూరు పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపికచేశారు. ఆయనకు రూ. 1,116 పారితోషికం ఇచ్చారు. సబ్‌రిజిస్ర్టార్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి చిత్రపరిశ్రమలో కొనసాగేందుకు నిర్ణయం తీసుకున్నారు. తొలుత మనదేశం సినిమాలో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌గా నటించి 1949లో వెండితెరపై ప్రేక్షకులకు కనిపించారు. తర్వాత ఆయన వెండితెరపై వెలిగిపోయారు. ఆయన 44ఏళ్ల సినీ జీవితంలో 13చారిత్రాత్మక, 55జానపద, 186సాంఘిక, 44పౌరాణిక చిత్రాల్లో నటించారు.

నిత్యకృషీవలుడు
ఎన్టీఆర్‌ వెండితెరపై పాత్రధారేకాదు.. దర్శక, నిర్మాతగా రాణించాడు. ఆయన దర్శకత్వంలో సీతారామకల్యాణం 1961లో విడుదలైంది. 1977లో దానవీరశూరకర్ణ నిర్మించి అందులో మూడు పాత్రలు పోషించారు. 1978లో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకానికి దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్‌ నటించిన సాంఘిక చిత్రాల్లో అడవిరాముడు, యమగోల బాక్సాఫీస్‌ హిట్స్‌గా నిలిచాయి. ఆయన ఎంతో క్రమశిక్షణతో ఉండేవారు. నర్తనశాల సినిమాలో బృహన్నల పాత్ర పోషించేందుకు వెంపటి చిన సత్యం వద్ద కూచిపూడి నృత్యం చేర్చుకున్నారు. శ్రీమద్‌ విర్వాట్‌పర్వంలో ఐదు పాత్రలు పోషించిన అగ్రశేణి నటుడు ఆయన. కఠోర సాధన, అంకితభావం, క్రమశిక్షణ ఆయనను చలనచిత్ర, రాజకీయ, సామాజిక రంగాల్లో ముందుకు నడిపించాయి.

రాజకీయాల వైపు..
కాంగ్రెస్‌ ప్రభుత్వం అంతర్గత కుమ్ములాటలతో తరచూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని మారుస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఐదేళ్లలో నలుగురు ముఖ్యమంత్రులు మారడంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లో ఆదరణ కోల్పోయింది. ఆయన 1981లో సర్దార్‌ పాపారాయుడు సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ప్రజల కోసం పనిచేస్తానంటూ రాజకీయ రంగం వైపు ఆసక్తి కనబరిచారు. తర్వాత నటించాల్సిన సినిమాలను త్వరితగతిన పూర్తి చేశారు. ఆయన 1982 మార్చి 29వ తేదీ రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో పార్టీ పేరు తెలుగుదేశం అని నిర్ణయించేశారు. చైతన్య రథం సిద్ధం చేసి తెలుగుదేశం పిలుస్తోంది రా… కదలి రా… అనే నినాదంతో రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసి దేశ రాజకీయాలను సైతం శాసించే స్థాయికి ఎదిగారు.

ఆయన 1983 శాసనసభ ఎన్నికల్లో గుడివాడ నుంచి అపూర్వ విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఆయన పాలనలో అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. 1984 ఆగస్టు 16న నాటి గవర్నర్‌ రాంలాల్‌ ఎన్టీఆర్‌ను గద్దెదించి నాదెళ్ళ భాస్కరరావు దొడ్డిదారిన గద్దెనెక్కించడానికి ప్రయత్నాలు జరిగాయి. ప్రజా ఆగ్రహంతో, మిత్రపక్షాల సహకారంతో తిరిగి సెప్టెంబర్‌ 16న ఎన్టీఆర్‌ మళ్ళీ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కారు. అప్పటి నుంచి ఆయన రాష్ట్ర రాజకీయాలలో అధికార, విపక్ష నేతగా ఒక వెలుగు వెలిగి 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయస్సులో దివికేగారు.

ఏది చేసినా సంచలనమే
రాజకీయ రంగంలో ప్రవేశించి ప్రజా సంక్షేమం, సంరక్షణ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. తెలుగుజాతికి, తెలుగుభాషకి గుర్తింపు తెచ్చారు. స్ర్తీలకు ఆస్తిలో వాటా కల్పించారు. బలహీన వర్గాలకు లక్షలాది ఇళ్లు కట్టించారు. ప్రధానంగా రూ.2కే కిలో బియ్యం వాగ్దానాన్ని అనేక ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వెనుకాడకుండా అమలు చేశారు. తెలుగుగంగ ప్రాజెక్టు రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చారు. దేశంలో ప్రధాన ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తెచ్చారు. అనేక మంది కొత్తవారిని, విద్యావంతులను రాజకీయాలకు పరిచయం చేసి ఒంటి చేత్తో గెలిపించారు. నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్‌ అంటూ సమర్థించడం విశేషం. పటేల్‌పట్వారీ వ్యవస్థను రద్దు చేసి తెలంగాణ ప్రజానీకానికి ఆయన అత్యంత చేరువయ్యారు. ఎన్టీఆర్‌ సినీ, రాజకీయ, సామాజిక రంగాల్లో ఏమి చేసినా ఒక సంచలనంగా ఉండేది.