మహానాడుకు ‘పసుపు’ దండు పోటెత్తింది! మహానాడు ప్రాంగణానికి చేరుకునే దారులు మొదలుకొని, ప్రాంగణమంతా పసుపు వర్ణ శోభితమైంది! తెలుగుదేశం పార్టీ పండుగగా భావించే మహానాడుకు ప్రత్యేకంగా పసుపు వస్ర్తాలు ధరించి రావటం ఆనవాయితీగా వస్తోంది. పార్టీ ఆదేశానుసారం 95 శాతం మంది పసుపు వస్ర్తాలను ధ రించి వచ్చారు. పసుపు షర్టు వేసుకు రాలేని అతి కొద్దిమంది కూడా తమ మెడలో పసుపు కండువా వేసుకున్నారు. వలంటీర్లు, సీబీఎన్‌ ఆర్మీ, పారిశుధ్య కార్మికులతో సహా ఇతర అనేక సేవలందించే వారంతా పసుపు వర్ణపు దుస్తులే వేసుకున్నారు. మహిళలు సైతం పసుపు చీరలను ధరించి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదలుకొని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, కమిటీల నేతలు, అనుబంధ సంఘాల బాధ్యులు ఇలా ప్రతి ఒక్కరూ పసుపు వస్ర్తాలను ధరించి వచ్చారు.

దీంతో మహానాడు ప్రాంగణం పసుపు వర్ణ శోభితమైంది! పసుపు దండు కవాతే చేసింది! లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మహానాడు ప్రాంగణంలో రిజిస్ర్టేషన్‌ కౌంటర్ల దగ్గర బారులు తీరిన కారకర్తలతో పసుపు దనం పరచుకుంది. బయట ఎండవేడిమిని తట్టుకోవటానికి వీలుగా నిర్వాహకులు పసుపు రంగు టోపీలను పంచి పెట్టారు. రిజిస్ర్టేషన్‌ చేసుకోవటానికి వచ్చిన వారంతా పసుపు టోపీలను ధరించటంతో మరింత శోభ వచ్చింది. కౌంటర్లలో బారులు తీరిన పసుపు శ్రేణులు, లాబీలో ఏర్పాటు చేసిన చంద్రబాబు, ఎన్‌టీఆర్‌, లోకేష్‌ మినీ కటౌట్లు దగ్గర సెల్ఫీలు దిగుతూ పసుపు శ్రేణులు సందడి చేశాయి. డ్వాక్రా బజార్‌ను వేలాదిమంది పసుపు శ్రేణుల సందర్శనతో ఈ ప్రాంతం కూడా పసుపు మయమైపోయింది. మెడికల్‌ క్యాంప్‌, రక్తదాన శిబిరాలు కూడా పసుపు వర్ణాన్ని పులుముకున్నాయి.

భోజనాల కోర్టుల దగ్గర కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అశేష సంఖ్యలో త రలి వచ్చిన శ్రేణులంతా సిద్ధార్థ ప్రధాన మార్గంలో రాకపోకలు సాగించటంతో ఏకంగా కవాతే చేసినట్టు ఉంది. ఇలా ఎటు వైపు చూసినా.. సర్వం పసుపు మయంగా కనిపించింది.

కదిలింది పసుపు దండు
వాడవాడలా వెలసిన పసుపు తోరణాలు, జెండాల మధ్య నాయకులు, కార్యకర్తలు మహా దండులా ముందుకు సాగారు. మూడు నియోజకవర్గాల నుంచి బుల్లెట్‌లతో భారీ ర్యాలీగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నివాసానికి తరలివెళ్లారు. అక్కడి నుంచి మహానాడు ప్రాంగణానికి బయల్దేరిన సీఎం కాన్వాయ్‌కు ముందు ప్రభుత్వ విప్‌ బుద్దా వెంకన్న, నగర నాయకులు బొండా ఉమామహేశ్వర్రావు, గద్దె రామ్మోహన్‌ తదితరులు బందోబస్తులా కదిలారు. ప్రకాశం బ్యారేజి మీదుగా బందరురోడ్డు, ఎన్టీఆర్‌ సర్కిల్‌, పంటకాలువ రోడ్లు, పటమట మీదుగా వీఆర్‌ సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలోని మహానాడుకు తరలివెళ్లారు. సీఎం కాన్వాయ్‌ వెళ్లిన మార్గంలో ఏర్పాటుచేసిన ట్రాఫిక్‌ నిబంధనలకు నగర ప్రజలు స్వచ్ఛందంగా సహకరించారు.

మహానాడు సందర్భంగా నగరంలో ఆదివారం ఉదయం నుంచి తెలుగు తమ్ముళ్ల సందడి మొదలైంది. రహదారులపై పసుపు తోరణాలు, జెండాలు, ర్యాలీలతో హడావుడి చేశారు. ఎమ్మెల్యేలు వారి కార్యాలయాల నుంచి బైక్‌ ర్యాలీలతో బయల్దేరి ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్నారు. ముందుగా ఉదయం ఆరున్నరకే తమ కార్యాలయం నుంచి బయల్దేరిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ఎన్టీయార్‌ సర్కిల్లోని ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలవేసి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. ఉదయం ఎనిమిదిన్నరకు బయల్దేరిన బొండా ఉమామహేశ్వర్రావు సుమారు వంద బైక్‌లతో ర్యాలీగా సీఎం నివాసానికి వెళ్లారు.

చంద్రబాబుతో కలిసి మహానాడుకు బయల్దేరిన కాన్వాయ్‌కు ముందు నగర నాయకులు ర్యాలీగా బయల్దేరగా ప్రకాశం బ్యారేజి, వినాయకుడి గుడి మీదుగా బందరురోడ్డు అక్కడి నుంచి ఎన్టీయార్‌ సర్కిల్‌, పంటకాలువ మీదుగా మహానాడు నిర్వహించే ప్రాంగణానికి కాన్వాయ్‌ చేరుకుంది. సీఎంతో కలిసి ప్రాంగణానికి ర్యాలీగా వెళ్లిన వారిలో రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వర్రావు, ఎమ్మెల్యేలు బోడేప్రసాద్‌, కార్పొరేటర్లు, సీనియర్‌కార్యకర్తలు ఉన్నారు.

స్వచ్ఛంద సహకారం
సీఎం కాన్వాయ్‌ రాకతో బెంజ్‌సర్కిల్‌ నుంచి నిర్మలా కాన్వెంట్‌, కృష్ణవేణి స్కూల్‌ రోడ్డు, పటమట, పంటకాలువ రోడ్లపై పోలీసు యంత్రాంగం ట్రాఫిక్‌ నిబంధలను విధించింది. ప్రజానీకం పోలీసులకు స్వచ్ఛందంగా సహకరించారు.

వీఐపీలకు-వీవీఐపీలకు ప్రత్యేక మార్గాలు
పార్కింగ్‌ సమస్యలు తలెత్తకుండా మహానాడుకు వెళ్లే వాహనాలకు వేర్వేరు పార్కింగ్‌ పాస్‌లను నిర్వాహకులు కేటాయించారు. ఏ, ఏఏ అని కోడ్‌ కేటాయించిన వాహనాలకు పటమట, బందరురరోడ్డు మీదుగా ప్రవేశం కల్పించగా, డీ కోడ్‌ కేటాయించిన పాస్‌లకు పంటకాలువ మీదుగా ప్రవేశం కల్పించారు.