మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి(93) ఇకలేరు. తొమ్మిదివారాలుగా ఎయిమ్స్‌లో మృత్యువుతో పోరాడుతూ కన్నుమూశారు. మంగళవారం నుంచి ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. తొమ్మిదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజపేయి.. 9 వారాలుగా ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో మంచానికే పరిమితమయ్యారు. మూత్రనాళాల ఇన్ఫెక్షన్‌, శ్వాస తీసుకోవడం కష్టం కావడం వంటి సమస్యలతో బాధపడుతున్న వాజ్‌పేయిని జూన్‌ 11న ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేర్చారు. నాటి నుంచి అక్కడే ఆయన చికిత్స పొందారు. మంగళవారం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సనందించారు.
అయితే ఆయన మూత్రపిండాల్లో ఒకటే పనిచేస్తుండడం, బలహీనమైన ఊపిరితిత్తులు, మధుమేహం కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది.
వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా బుధవారం సాయంత్రం ఎయిమ్స్‌కు వెళ్లి ఆయనను చూసొచ్చారు. అంతకుముందు.. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా మోదీని కలుసుకుని వాజపేయి పరిస్థితి గురించి వివరించారు. దీంతో వాజపేయిని చూసేందుకు ప్రధాని ప్రోటోకాల్‌ నిబంధనల్నీ పక్కనబెట్టారు. బుధవారం ఉదయమే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తన ప్రసంగంలో.. కశ్మీర్‌ సమస్య పరిష్కారం విషయంలో వాజపేయి మార్గాన్ని అనుసరిస్తానని చెప్పడం, ఆయన చెప్పిన మాటల్ని ఉటంకించడం గమనార్హం.
2009 నుంచి అనారోగ్యంతో..
  1. వాజపేయి 2005 డిసెంబరులో క్రియాశీల రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించారు. 2009 ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఆయన ముందే చెప్పారు. అప్పటిదాకా తాను ప్రాతినిధ్యం వహించిన లఖ్‌నవ్‌ నుంచి ఆ ఎన్నికల్లో పోటీ చేసిన లాల్‌జీ టాండన్‌ను బలపరుస్తూ నియోజకవర్గ ప్రజలకు లేఖ రాశారు. అనారోగ్య కారణాల వల్ల ప్రచారానికి కూడా రాలేకపోతున్నానని పేర్కొన్నారు. అనంతరం 2009 ఫిబ్రవరి 6న వాజపేయికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ రావడంతో ఎయిమ్స్‌లో చేరి.. కొంతకాలానికి డిశ్చార్జి అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆయన గుండెపోటు, పక్షవాతం రావడంతో మాట దెబ్బతిన్నది. ఆపై జ్ఞాపకశక్తి కోల్పోయారు. క్రమంగా మధుమేహం తీవ్రతరమైంది. మూత్రపిండాల ఇన్ఫెక్షన్‌ కారణంగా ఆయన కిడ్నీల్లో ఒకదానిని గతంలోనే తొలగించారు. కాగా మూత్రపిండాలు దెబ్బతినడం వల్లనే జూన్‌ 11న ఆయన మళ్లీ ఎయిమ్స్‌లో చేరారు. వాజపేయి కోలుకుంటున్నారని, డిశ్చార్జి చేస్తామని ఎయిమ్స్‌ ప్రకటించినప్పటికీ.. ఆరోగ్య పరిస్థితి కుదుట పడలేదు.