హరికృష్ణ అంతిమయాత్రకు ఆయన కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే హరికృష్ణ పార్థివదేహం మెహిదీపట్నంలోని ఆయన నివాసానికి చేరుకుంది. నల్గొండ జిల్లా అన్నెపర్తి నుంచి హరికృష్ణ భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు. హరికృష్ణ వెంట ఆయన కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఉన్నారు. హరికృష్ణ అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌లో హరికృష్ణ అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. హరికృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్‌ జోషిని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అయితే హరికృష్ణ పార్ధివదేహాన్ని చైతన్య రథంపై అంతిమయాత్ర నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన అంతిమయాత్ర చైతన్యరథంపై జరుగనుంది.

అయితే చైతన్యరథానికి ఎన్టీఆర్ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉంది. 1982లో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. ఆయన తన ఎన్నికల ప్రచారం కోసం ఓ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి చైతన్యరథంగా నామకరణం చేశారు. ఈ వాహనంపై ఏపీ అంతా కలియతిరిగారు. దాదాపు ఓ ఏడాది పాటు రాష్ట్రాన్ని చుట్టేశారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అత్యధిక సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతో ఎన్టీఆర్ సీఎం పీఠాన్ని అధిష్టించారు. అనంతరం హరికృష్ణ అన్నా తెలుగుదేశం పార్టీని స్థాపించి చైతన్యరథంపై తన ఎన్నికల ప్రచారం చేశారు. అచ్చం ఎన్టీఆర్ లాగే కాకి చొక్కా, ప్యాంట్ వేసుకుని ప్రచారం చేశారు. అలాగే 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా అచ్చం తాతాగారి లాగనే చైతన్యరధంపై ఎన్నికలు ప్రచారం చేశారు. నందమూరి కుటుంబానికి చెందిన మూడు తరాలు చైతన్యరథంపై ప్రచారం చేశాయి. ఇప్పుడు హరికృష్ణ అంతిమయాత్ర కూడా చైతన్యరథంపై నిర్వహించడం సముచితంగా ఉందని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఇదే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అంటూ వారు వ్యాఖ్యానిస్తున్నారు.