ఖమ్మం: దేశంలో రెండే రెండు ఫ్రంట్‌లు ఉన్నాయని.. ఒకటి ఎన్డీయే ఫ్రంట్‌, రెండోది ఎన్డీయే వ్యతిరేక ఫ్రంట్‌ అని, ఎవరు ఎటువైపు ఉన్నారో తేల్చుకోవాల్సిన సమయం ఆసననమైందని, కేసీఆర్‌ ఎక్కడుంటారో చెప్పాలని, ఎంఐఎం ఎక్కడుంటుందో తెలపాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.

బుధవారం ఖమ్మంలో జరుగుతున్న ప్రజాకూటమి బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ఈవీఎంలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఓటు ఎవరికి వేసింది వచ్చిన స్లిప్పుతో చూసుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్‌ పరికరాలను హ్యాక్‌ చేయడం చాలా తేలికని, అందుకే జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నానని ఆయన అన్నారు. టెక్నాలజీనీ అధికంగా వాడే వ్యక్తిగా లోటుపాట్లు తనకు తెలుసునని చంద్రబాబు పేర్కొన్నారు.

నూటికి నూరుశాతం కాదు… తెలంగాణలో 1000 శాతం ప్రజాకూటమిదే గెలుపని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ధైర్యంగా పోరాడుదామని, భయపడితే జీవితాంతం నష్టపోతామని ఆయన అన్నారు. తెలంగాణ యువతకు ప్రోత్సహిస్తే… ప్రపంచాన్నే శాసించే శక్తి ఉందని, ఉన్న వనరులు సద్వినియోగం చేసుకుంటే… తెలంగాణ నెంబర్‌వన్‌ రాష్ట్రంగా ఉంటుందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లలో ఏం అభివృద్ధి జరగలేదని, అప్పులు పెరిగిపోయాయని విమర్శించారు. బీజేపీకి ఓట్లు లేవు కానీ… హెలికాప్టర్లు ఉన్నాయని, బీజేపీ నేతలు డబ్బు సంచులతో తిరుగుతున్నారని బాబు విమర్శించారు.