ఆకాశవాణి పాడి-పంట కార్యక్రమంలో ‘చిన్నమ్మ’గా శ్రోతలకు చిరపరిచితమైన నిర్మలా వసంత్‌ (73) ఆరోగ్యం విషమంగా ఉంది. ఆమెను కుటుంబసభ్యులు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. నిర్మల మృతిచెందారంటూ ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రంలో సిబ్బంది సంతాపసభ నిర్వహించడం.. పత్రికల్లో వార్త రావడంతో అభిమానులు దిగ్ర్భాంతికి గురయ్యారు.


కాగా తమ ఈ పొరపాటును క్షమించాలని హైదరాబాద్‌ ఆకాశవాణి కేంద్రం కోరింది. నిర్మలా వసంత్‌ కుటుంబసభ్యులు, అభిమానులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది.

పొరపాటుకు దారితీసిన పరిస్థితులను ఆకాశవాణి సిబ్బంది వివరించారు. నిర్మలా వసంత్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆమెతో కలిసి 30ఏళ్లు పనిచేసిన జ్యోత్స్నకు కబురుపెట్టారని.. ఆ క్రమంలో ఆమె ఇకలేరు అంటూ చెప్పారని.. అంత్యక్రియల ఏర్పాటుపైనా మాట్లాడారని పేర్కొన్నారు. తర్వాత కుటుంసభ్యులు ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడం.. ల్యాండ్‌లైన్‌కు కూడా అందుబాటులో లేకపోవడంతో ఆకాశవాణి వార్తల్లో నిర్మలా వసంత్‌ మృతిచెందారంటూ చెప్పడం జరిగిందన్నారు. అనంతరం రెండు రోజులకు ఆకాశవాణి కేంద్రంలో సంతాసభ నిర్వహించి పత్రికలకు పంపామన్నారు. పత్రికల్లో వార్తను చూసి.. వారి రెండో అమ్మాయి ‘అమ్మ హాస్పిటల్లో వెంటిలేటర్‌పై ఉన్నారు’ అని ఫోన్‌ చేసి చెప్పడంతో దిగ్ర్భాంతికి గురయ్యామన్నారు. ఆమె వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.