ప్రజారోగ్య దహనం

తరతమ భేదాలతో ఉత్తర భారతదేశ రాష్ట్రాల్ని ఇప్పుడు అక్షరాలా దహించివేస్తున్న సమస్య- పర్యవసానాలు పట్టించుకోకుండా పంట వ్యర్థాల్ని పెద్దయెత్తున తగలబెట్టడం. తద్వారా వాటిల్లుతున్న దుష్పరిణామాల తీవ్రతను కళ్లకు కడుతూ అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ (ఐఎఫ్‌పీఆర్‌ఐ) వెల్లడించిన తాజా అధ్యయనాంశాలు దిగ్భ్రాంతకరం. ‘నాసా’ ఉపగ్రహ సమాచారం సాయంతో- పంట వ్యర్థాలను విరివిగా దహనం చేస్తున్న ప్రాంతాల్లో, అలా చేయని చోట్ల ప్రజానీకం ఆరోగ్య స్థితిగతుల్ని సరిపోల్చిన విశ్లేషణ వివరాలు అసంఖ్యాక శ్వాసకోశాలు ఎలా పొగచూరిపోతున్నాయో తెలియజెబుతున్నాయి.

అయిదేళ్ల వ్యవధిలో పంట వ్యర్థాలు, బాణసంచా కాల్పుల మూలాన భారత ఆర్థిక వ్యవస్థకు సుమారు 13 లక్షల కోట్ల రూపాయల మేర నష్టం దాపురించిందని, స్థూల దేశీయోత్పత్తిలో అది 1.7 శాతానికి సమానమన్న గణాంకాలు సంక్షోభ విస్తృతిని స్పష్టీకరిస్తున్నాయి. ఒక్క టన్ను పంట వ్యర్థాలను తగలబెడితే మూడు కిలోల సూక్ష్మ ధూళికణాలు, అరవై కిలోల కార్బన్‌ మోనాక్సైడ్‌, 14 వందల కిలోలకు మించి బొగ్గుపులుసు వాయువుతోపాటు బూడిద, సల్ఫర్‌డయాక్సైడ్‌ ఆవరిస్తాయని అంచనా. దేశంలో ఏటా పది కోట్ల టన్నుల దాకా పంట వ్యర్థాల్ని తగలబెడుతుండగా అందులో సగానికి పైగా దహన కార్యక్రమం పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ ప్రదేశ్‌లలోనే చోటుచేసుకుంటోంది. దాన్నిబట్టి పరిసర ప్రాంతాల్లో వాతావరణ విధ్వంసం ఎలా సాగుతోందో వేరే చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యంత కలుషిత ప్రాంతంగా నమోదైన గురుగ్రామ్‌, దాన్ని వెన్నంటి ఆ జాబితాలో నిలిచిన ఘజియాబాద్‌, ఫరీదాబాద్‌, నొయిడా ఆ చుట్టుపక్కలవే. పెనుముప్పు అక్కడికే పరిమితం కావడంలేదు. వాయవ్య భారతం నుంచి విషవాయు ప్రభావం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, ఒడిశాలపైనా ప్రసరిస్తోంది. ఈ ఉత్పాతం, తక్షణ దిద్దుబాటు చర్యల అత్యావశ్యకతను ఉద్బోధిస్తోంది.
వాయునాణ్యతకు తూట్లు పడుతున్న చోట్ల శ్వాసకోశ వ్యాధులు, గుండెపోట్లు, మృత శిశుజననాలు పెచ్చరిల్లుతున్నాయన్న విశ్లేషణల ప్రాతిపదికన- చురుగ్గా చేపట్టాల్సిన అత్యవసర చర్యల ప్రణాళికలు గతంలోనే వెలుగు చూశాయి. ప్రైవేటు వాహనాల వాడకాన్ని క్రమబద్ధీకరించి ప్రజారవాణా వ్యవస్థను పరిపుష్టీకరించడంతోపాటు కలప, బొగ్గు వినియోగ నియంత్రణకూ ఘనతర ఆశయ తీర్మానాలు మోతెక్కిపోయాయి. పంజాబ్‌, హరియాణా, యూపీ, రాజస్థాన్‌, దిల్లీ పరిసరాల్లో పంట వ్యర్థాల దహనాన్ని నిషేధించాల్సిందిగా 2015 నవంబరులో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) నిర్దేశాలు జారీ అయ్యాయి. 2017లో దేశవ్యాప్తంగా సంభవించిన ప్రతి ఎనిమిది మరణాల్లో ఒకటి వాయుకాలుష్యం కారణంగా చోటుచేసుకోవడం, అటువంటి అభాగ్యుల సంఖ్య పన్నెండున్నర లక్షలకు ఎగబాకడం- నిబంధనలు గాలికి ఎలా కొట్టుకుపోతున్నాయో చాటుతున్నాయి. ఉత్తర భారత దేశంలో పశుగ్రాసంగా గోధుమ గడ్డినే వాడటం పరిపాటి. అందువల్ల లక్షలాది టన్నుల వరి దుబ్బుల్ని పొలంలోనే వదిలేసి అక్కడికక్కడే తగలబెట్టే అలవాటు వేరూనుకొంది. ఎకరా రూ.60 వేల వరకు లీజుకు తీసుకుని సాగుచేయాల్సి రావడం, దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే సగటు కమతం విస్తీర్ణం అధికంగా ఉండటం వల్ల ప్రభుత్వాలు ఆదుకుంటేనే గాని వరి దుబ్బుల్ని తగలబెట్టే బదులు ఇతరత్రా తొలగించడం సాధ్యం కాదని స్థానిక రైతులు చిరకాలంగా మొత్తుకుంటున్నారు. ఏడాది క్రితం పంజాబ్‌, హరియాణా, దిల్లీ, యూపీ రైతాంగానికి పంట వ్యర్థాల నిర్వహణ నిమిత్తం కేంద్రం రూ.1,152 కోట్ల పథకం ప్రకటించినా, పొలాల్లో మంటలు కొనసాగుతూనే ఉన్నట్లు క్షేత్రస్థాయి కథనాలు ధ్రువీకరిస్తున్నాయి. ఒక్క పంజాబ్‌లోనే 84 శాతం పౌరుల ఆరోగ్యాన్ని పంట వ్యర్థాల దహనం కుంగదీస్తున్నట్లు అధికారిక అధ్యయనమే తేటపరచినా, సంక్షోభ నివారణ కృషి నత్తనడకను తలపిస్తోంది!
భౌగోళిక స్థితిగతుల్లో అంతరాల కారణంగా ఉత్తరాదికన్నా దక్షిణాది రాష్ట్రాల్లోనే వరిని అధికంగా సాగు చేస్తారు. పంజాబ్‌ ప్రభృత రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం రూపేణా హాని తీవ్రతను తెలియజెప్పడానికి ఐఎఫ్‌పీఆర్‌ఐ ఎంచుకున్న ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుల్లో అటువంటి దహన ఘట్టాలు దాదాపుగా కానరావు. అయినా కంచికచర్ల, గజ్వేల్‌ లాంటి ప్రాంతాల్లో పత్తి, ఇతర పంటల వ్యర్థాలను పొలాల్లోనే తగలబెడుతున్న ఉదంతాలు అడపాదడపా వెలుగు చూస్తున్నాయి. దేశంలో ఎక్కడైనా సరే పంటభూముల్లో వ్యర్థాల్ని తగలబెడితే- గాలి కలుషితం కావడం ఒక్కటే కాదు, నేలలో తేమ శాతం తగ్గిపోతుంది. భూమిపొరల్లో పైరుకు ఉపయోగపడే వేల రకాల సూక్ష్మజీవులు హతమారిపోతాయి. సేంద్రియ, పీచు పదార్థాల అవశేషాలూ కొల్లబోతాయి. దక్షిణాది రాష్ట్రాల్లోని అత్యధిక ప్రాంతాల్లో వరి పంట నూర్చాక గడ్డిని పశువులకు మేతగా భద్రపరచడం ఆనవాయితీ. ఈ పద్ధతిని అనుసరించడం ఇష్టంలేని ఇతర ప్రాంతాల రైతులు వరి, తృణ ధాన్యాల్లాంటి పంటల సాగు దరిమిలా వ్యర్థాల్ని పొలంలోనే కలియదున్నేస్తే- జీవన ఎరువుగా అక్కరకొచ్చి, భూసారం ఇనుమడిస్తుందన్న నిపుణుల సిఫార్సు శిరోధార్యం. కొన్ని రకాల పంటల వ్యర్థాల్ని వంట చెరకుగా మార్చుకుని హోటళ్లు, బాయిలర్‌ పరిశ్రమల్లో వినియోగిస్తున్నారు. అలా వంటచెరకు, ఇతర ఉత్పత్తుల తయారీ కోసం అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వాలు చొరవ చూపాల్సి ఉంది. పంట వ్యర్థాల్ని ఉపయోగించుకునే వీలున్న విద్యుత్‌ కేంద్రాలు, వివిధ పరిశ్రమల జాబితా క్రోడీకరించాలని ఎన్‌జీటీ లోగడే ఆదేశించింది. జాతికి వాయుగండం తప్పించే కసరత్తు చురుగ్గా పట్టాలకు ఎక్కితేనే, యావత్‌ భారతావనీ తేలిగ్గా ఊపిరి పీల్చుకోగలిగేది!