పాక్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద కేంద్రాన్ని ధ్వంసం చేయడం ద్వారా భారత్ తన శక్తిసామర్థ్యాలను, చిత్తశుద్ధిని చాటిచెప్పిందని..మరోసారి ఉగ్రదాడి జరిగితే అందుబాటులో ఉన్న ‘అన్ని అవకాశాల’ను ఉపయోగించుకుంటుందని అధికార వర్గాలు తేల్చిచెప్పాయి. తన భూభాగాన్ని కేంద్రంగా చేసుకుని ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకునేలా పాకిస్తాన్‌పై వత్తిడి తేవడమే తమ ఉద్దేశమని తెలిపాయి.

బాలాకోట్ దాడి ఉదంతం ముగిసిందని, ఇప్పుడు పాకిస్తాన్ తన ఉగ్రవాద నిరోధక చిత్తశుద్ధిని చాటుకోవాలని అత్యున్నత వర్గాలు వెల్లడించాయి. బాలాకోట్‌పై జరిగిన దాడిలో ఎంత మంది మరణించారన్న దానిపై రాజకీయ వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఈ వర్గాలు మృతుల సంఖ్యను వెల్లడించక పోవడం గమనార్హం. మళ్లీ ఉగ్రవాద దాడి జరిగే పక్షంలో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేసిన అధికార వర్గాలు ఈ సారి పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగానే ఉంటాయని, ఎంత మాత్రం ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేశాయి.తమ దేశంలోని ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేయాలని పాకిస్తాన్‌కు ఇప్పటికే స్పష్టం చేశామని, ఇందుకు సంబంధించి విశ్వసనీయ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుబడుతోందని తెలిపాయి. ఇటీవల జరిగిన వైమానిక సంఘర్షణలో ఎఫ్-16 యుద్ధ విమానాలను పాకిస్తాన్ ఉపయోగించినట్టుగా తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను అమెరికాకు తెలియజేశామని తెలిపాయి. దీనిపై అమెరికా ప్రభుత్వం దర్యాప్తు జరిపి వాస్తవాన్ని వెలుగులోకి తేగలదనే తాము నమ్ముతున్నామని అధికార వర్గాలు వెల్లడించాయి. బాలాకోట్‌పై దాడి నేపథ్యంలో ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకోవాలంటూ పాకిస్తాన్‌పై అన్ని వైపుల నుంచీ తీవ్రస్థాయిలో వత్తిడి తెస్తున్నామని తెలిపాయి. ఈ విషయంలో పాకిస్తాన్ చేస్తున్న ప్రచారాన్ని ప్రపంచ దేశాలు నమ్మడం లేదని, భారత్ వాదనకే విలువ ఇస్తున్నామని తెలిపాయి. ఉగ్రవాదం అన్నది భారత్-పాక్‌లకు సంబంధించింది కాదని, ఇది అంతర్జాతీయ సమస్య అన్న వాస్తవాన్ని అన్ని దేశాలకు భారత్ స్పష్టం చేసిందన్నాయి. జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్‌ను ఐరాస నిషేధిస్తే..పాకిస్తాన్ ఇరకాటంలో పడుతుందని, అజార్ తమ దేశంలోనే ఉన్నాడని పాక్ విదేశాంగ మంత్రే చెప్పిన విషయాన్ని గుర్తు చేశాయి. గత నెల 26న పాక్‌లోని జైషే మొహమ్మద్ కోటను భారత్ కుప్పకూల్చినప్పటి నుంచీ పశ్చిమ సెక్టార్‌లోని వైమానిక కేంద్రాలను గరిష్ట స్థాయిలో అప్రమత్తంగా ఉంచామని తెలిపాయి