పాక్‌కు తగిన బుద్ధి చెప్పాం

ధార్: పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్తాన్ టెర్రరిస్టు శిబిరంలోకి చొచ్చుకెళ్లి భారత్ గట్టిగా బుద్ధి చెప్పిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పటికైనా ఉగ్రవాద వైఖరిని మార్చుకోకపోతే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో పాకిస్తాన్‌కు స్పష్టమైన సందేశం అందించామని మంగళవారం ఇక్కడ జరిగిన ఒక ర్యాలీలో మోదీ ఉద్ఘాటించారు. బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ శిబిరంపై వైమానిక దళాల దాడులను విపక్షాలు కోరడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ఇవన్నీ కూడా పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడతున్నాయని వ్యాఖ్యానించారు. దాడి పాకిస్తాన్‌లో జరిగితే భారత్‌లోని కొందరికి ఎక్కడలేని నొప్పి తగులుతోందని ఆయన అన్నారు.

భారత్‌లో అస్థిరత్వం సృష్టించేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోందని, ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు చేయడమే పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులపై వైమానిక దాడుల నిర్వీర్యం చేయడం సబబేనన్నారు. మంగళవారం ఇక్కడ ఆయన అసంఘటిత కార్మికులకు పెన్షన్ స్కీంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విపక్ష పార్టీలను తనను తొలగించాలని కోరుకుంటున్నాయని, కాని తాను ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానని చెప్పారు. చౌకీదార్‌ను తీసేయాలనుకుంటున్నారని, కాని తాను దారిద్య్ర నిర్మూలనకు కృషి చేస్తున్నానని చెప్పారు. అవినీతిని ఏ రూపంలో ఉన్నా సహించే ప్రసక్తిలేదన్నారు. అందుకే విపక్షాలు మోదీ హటావో అనే నినాదంతో జనంలోకి వెళ్లినా నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రజల అభివృద్ధి కోసం తాను దేనికైనా సిద్ధమన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అవతరించిన మహాకూటమికి దిశ, దశ లేదన్నారు. మహాకూటమికి నాయకత్వం లేదని, దివాళాకోరు సిద్ధాంతాలతో సతమతమవుతోందన్నారు. ప్రధానమంత్రి శ్రమ యోగి మందన్ యోజన పెన్షన్‌స్కీం వల్ల అసంఘటిత కార్మికులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. దారిద్య్ర నిర్మూలనకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. కాంగ్రెస్ నేతలు కేవలం ఫోటోలకే పరిమితమవుతారన్నారు. నినాదాలు మాత్రం ఆకర్షణీయమైనవి ఇస్తున్నారన్నారు. పేదల సంక్షేమానికి నిర్దిష్టమైన చర్యలు తీసుకోకుండా వారిని గాలికివదిలేయడం అనేది కాంగ్రెస్‌కు వెన్నతో పుట్టిన విద్య అన్నారు. దారిద్య్రమనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్ అని కాంగ్రెస్ నేతలు పేర్కొనడం సరికాదన్నారు. 55 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిందేమీ లేదన్నారు. కాని చాయ్ వాలా 55 నెలల్లో దేశంలో చాలా సంస్కరణలు, మార్పులు తెచ్చారన్నారు. కమ్యూనిస్టులు దేశంలో చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా, ఇటువంటి స్కీంను తీసుకురాలేకపోయారన్నారు. ఓపికున్నంత కాలం పనిచేసి ఆ తర్వాత పనిచేయలేని శ్రామికులకు ఈ పెన్షన్ వరమని ఆయన చెప్పారు. ఈ స్కీం కింద అసంఘటిత కార్మికుడు నెలకు మూడువేల రూపాయల పెన్షన్‌పొందుతారన్నారు. ఇప్పటికే ఈ స్కీం కింద 14 లక్షల మంది కార్మికులు పేర్లను నమోదు చేసుకున్నారన్నారు.
.