మోహరిస్తున్న పాక్ సైన్యం?

న్యూఢిల్లీ: పాకిస్తాన్ పాలకులు తమ సైన్యాన్ని వాస్తవాధీన రేఖ వైపు తరలిస్తున్నట్లు తెలిసింది. భారత సరిహద్దుల్లో మోహరించేందుకు తమ సైన్యాన్ని వాస్తవాధీన రేఖకు తరలిస్తున్న పాక్ సైన్యాధికారులు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ తాలిబాన్‌తో కూడా చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. సైన్యంతోపాటు ఇస్లామిక్ ఉగ్రవాదులను కూడా ప్రయోగించాలనే ఆలోచనతోనే పాక్ సైన్యాధికారులు తాలిబాన్‌తో చర్చలు జరుపుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాక్ పాలకులు ఒకవైపు అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల వత్తిడి మూలంగా జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్ సోదరుడితోపాటు మరో యాభై మందిని అరెస్టు చేస్తూనే మరోవైపు తమ సైన్యాన్ని భారత సరిహద్దులకు తరలించటం చర్చనీయాంశం మారింది. జానీఖేల్, ఉత్తర వజిరిస్తాన్, బన్ను తదితర ప్రాంతాల్లోని తమ సైన్యాన్ని వాస్తవాధీన రేఖకు తరలించే కార్యక్రమాన్ని పాక్ సైన్యాధికారులు పెద్దఎత్తున చేపట్టినట్లు చెబుతున్నారు. మన దేశంపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్న పాకిస్తాన్ సైన్యం తమకు అనుకూలంగా ఉండే సమయంలో భారత సరిహద్దులపై విరుచుకుపడతారంటూ ఒక ఇంగ్లీష్ చానల్ ప్రసారం చేయటం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ సైన్యాధికారులు బలుచిస్తాన్‌లోని గిరిజన ప్రాంతాల్లో మోహరించిన తమ సైన్యాన్ని వాస్తవాధీన రేఖకు తరలిస్తున్నారనీ, సైన్యం తరలింపులకు వారు అన్ని రకాల వాహనాలను రంగంలోకి దించారనే వార్తలు వస్తున్నాయి. సైన్యానికి అవసరమైన అన్ని రకాల వస్తువులు, ఇతర సరఫరాలను సరిహద్దులకు తరలించేందుకు పాకిస్తాన్ సైన్యం పౌర వాహనాలను బలవంతంగా ఉపయోగించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.