వ్యూహాత్మకంగానే ఓటుపై వేటు!
ఆలస్యంగా మేల్కొన్నామంటున్న టీడీపీ
జగన్‌ అంగీకారంతో సంచలనం

అమరావతి : ‘మా ఓటు నమోదు చేసుకోండి’ అని కోరడం సహజం! ‘పక్కవాళ్ల ఓటు తీసేయండి’… అని ఫిర్యాదు చేస్తే, అది కూడా వందలు, వేల సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తితే, కచ్చితంగా అసాధారణం! ఉద్యమంలా సాగుతున్న ఓట్ల తొలగింపు ఫిర్యాదులపై సోమవారం ఒక పత్రిక ప్రత్యేక కథనం ప్రచురించింది. ఆ ఫిర్యాదుల వెనుక ఉన్నది తామేనని వైఎస్‌ జగన్‌ మొట్టమొదటిసారి ప్రకటించడం సంచలనం సృష్టించింది. దొంగ ఓట్లపైనే ఫిర్యాదు చేస్తున్నామని జగన్‌ చెబుతుండగా.. టీడీపీ సానుభూతిపరుల ఓట్లే లక్ష్యంగా ఫామ్‌-7లు ఇస్తున్నారని తెలుగుదేశం వర్గాలు పేర్కొంటున్నాయి.

దీనివెనుక భారీ కుట్ర ఉందని చెబుతున్నాయి. 2014 ఎన్నికల్లో కేవలం 5లక్షల ఓట్ల తేడాతో (ఒక్క శాతం) అధికారాన్ని కోల్పోయామని జగన్‌ తరచూ మదనపడుతుంటారు. ఈసారి తాము ఆధిక్యం సాధించాలంటే… కచ్చితంగా తమ పార్టీకి ఓటు వేయరని తెలిసే 8లక్షల ఓట్లను గాయబ్‌ చేయాలని వైసీపీ కుట్ర పన్నిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ‘ఇందులో భాగంగా టీడీపీ భారీగా దొంగ ఓట్లను నమోదు చేయిస్తోందని తొలుత ఆరోపించారు. దీని వెనుక వ్యూహమేమిటో తొలుత మాకు అర్థం కాలేదు. టీడీపీ ఓట్లను చాపకింద నీరులా తొలగించేందుకు ఫిర్యాదు చేస్తూ.. అది బయటపడకుండా పైకి రచ్చ చేస్తున్నట్లు ఇప్పుడు తేటతెల్లమైంది’ అని టీడీపీ నాయకుడొకరు తెలిపారు.

బూత్‌ స్థాయిలో వందల్లో ఫిర్యాదులు చేయడం.. ఎవరైనా సర్వేలకు వెళితే ఓట్లను తొలగించేందుకు వచ్చిన బూచోళ్లుగా చిత్రీకరించి బంధించడం.. వారివద్ద ఉన్న ట్యాబ్‌లు లాక్కోవడం వంటి పరిణామాలన్నీ ఒక వ్యూహం ప్రకారం జరిగినవేనని టీడీపీ ఇప్పుడు అంచనాకు వచ్చింది. వైసీపీ కుట్రలను తాము చాలా ఆలస్యంగా గుర్తించగలిగామని ఒక నాయకుడు చెప్పారు.