విజయవాడ: రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఓటు తొలగింపునకు సంబంధించి 1.61 లక్షల దరఖాస్తులను పరిశీలించామని వీటిలో 5309 దరఖాస్తులు మాత్రమే అసలైనవిగా గుర్తించామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. 1.55 లక్షల నకిలీ దరఖాస్తులను తిరస్కరించామన్నారు. 45 వేల మంది సిబ్బందితో ఈ దరఖాస్తులను నిరంతరం పరిశీలన చేస్తున్నామన్నారు. ఫారం-7 దుర్వినియోగంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసిందని, జనవరి 11 తరువాత ఒక్క ఓటు కూడా తొలగించలేదని స్పష్టం చేశారు. ఫారం-7లో దరఖాస్తు చేస్తే ఓటు తొలగించినట్లు కాదన్నారు. నకిలీ దరఖాస్తులపై పోలీసు కేసులు నమోదు చేయడంతో ఈ తరహా దరఖాస్తుల సంఖ్య తగ్గిందని అన్నారు. ఓట్ల తొలగింపు వ్యవహారంలో ప్రజల్ని గందరగోళానికి గురి చేసే ప్రకటనలు సరికాదని అన్నారు. ఫారం-7పై ఎన్నికల సంఘానికి అభ్యంతరాలు చెబుతున్నారని, కానీ బయటకు వెళ్లి ఓట్లు తొలగిస్తున్నారని చెబుతున్నారని అన్నారు. ఎక్కడ ఓట్లు తొలగించారో విమర్శించినవారే నిరూపించాలని అన్నారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా పని చేస్తుందని, అనుమానాలు అవసరం లేదని అన్నారు.