అంతరిక్ష భద్రతను పెంపొందించుకొనడంలో మన దేశానికి మరో విజయం లభించింది. మన శాస్తవ్రేత్తలు రూపొందించిన ‘ఉపగ్రహ విధ్వంసక క్షిపణి’ బుధవారం నాడు లక్ష్యాన్ని సాధించడం ఈ చారిత్రక విజయం. ప్రయోగించిన మూడు నిముషాలలోనే ఈ ‘ఉపగ్రహ విధ్వంసక క్షిపణి’- యాంటీ శాటిలైట్ మిస్సయిల్- భూమి చుట్టూ అంతరిక్షంలో ప్రదక్షిణం చేస్తుండిన ఒక ‘ఉపగ్రహాన్ని’ ఛేదించి కూల్చివేయడం భారత కీర్తిపతాక ధవళిమను మరింత ఉజ్వలం చేసిన పరిణామం. ‘శక్తిక్రియ’- ఆపరేషన్ శక్తి- పేరుతో జరిగిన ఈ ‘శత్రు ఉపగ్రహ’ విధ్వంస కార్యక్రమం విజయవంతం కావడంతో మన దేశం ఈ అంతరిక్ష సమర పాటవం కలిగిన మరో మూడు దేశాల సరసన సగర్వంగా నిలబడగలుగుతోంది. ఇంతవరకు ఇలా అంతరిక్ష పరిక్రమ పథంలో దూసుకొనివచ్చే శత్రు ఉపగ్రహాలను ప్రతిఘటించి నిరోధించి విధ్వంసం చేయగల సాంకేతిక సమర పటిమ అమెరికా, రష్యా, చైనా దేశాలకు మాత్రమే ఉంది. చైనా దురాక్రమణ ప్రమాదం అన్నివైపుల నుంచి పొంచి ఉన్న ఈ తరుణంలో మన దేశానికి సైతం ఈ ‘నిరోధక పటిమ’, ‘ఉపగ్రహ విధ్వంసక పాటవం’ సమకూడడం జాతి మొత్తం హర్షించదగిన శుభంకర పరిణామం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ అంతరిక్ష సమర ప్రయోగ విజయ సమాచారాన్ని సమావిష్కరించడం ఈ పరిణామ ప్రాధాన్యానికి ప్రత్యక్ష ప్రమాణం.. చైనా వ్యూహాత్మక దురాక్రమణ నిరంతరం విస్తరిస్తుండడం ఈ మన అంతరిక్ష సమర విజయానికి నేపథ్య వైపరీత్యం. మనం ప్రయోగించిన క్షిపణి భూమి చుట్టూ పరిక్రమిస్తున్న ఉపగ్రహాన్ని- ఊహాత్మక శత్రువులు ప్రయోగించిన ఉపగ్రహాన్ని- విధ్వంసం చేసిన తరుణంలోనే చైనా ప్రభుత్వం వేలాది చిత్రపటాల- మ్యాప్స్-ను ధ్వంసం చేసిన సమాచారం ప్రచారం కావడం చైనావారి వ్యూహాత్మక దురాక్రమణకు మరో నిదర్శనం. అరుణాచల్ ప్రదేశ్ మన దేశంలో భాగం కాదని చైనా దశాబ్దులుగా అసత్య ప్రచారం చేస్తోంది. కానీ చైనాలో ప్రచురితమైన వేల సంఖ్యలోని భౌగోళిక చిత్రపటాలలో ‘అరుణాచల్’ను మన దేశపు అంతర్భాగంగానే చూపించారట! చారిత్రక వాస్తవాలు భౌగోళిక సహజ రూపాలు ఇలా ఆవిష్కృతమయ్యాయి. కానీ ఈ సత్యాన్ని భూస్థాపితం చేయడానికై చైనా ఈ చిత్రపటాలను ధ్వంసం చేసింది. ఇలా చైనా వ్యూహాత్మక దురాక్రమణ నిరంతరం కొనసాగుతోంది. మనం ప్రతిఘటించవలసిన అతి ప్రమాదకర దురాక్రమణకు ‘రూపం’ చైనా. అందువల్ల మన శాస్తవ్రేత్తలు బుధవారం సాధించిన అంతరిక్ష సమర విజయం చైనాను నిరోధించడానికి మరో ‘ఉపకరణం..’, భరత గరిమకు శాశ్వత చిహ్నం…
భూమికి దూరంగా వేల మైళ్ల ఎత్తున శత్రుదేశాల ఉపగ్రహాలు పరిక్రమించడం కూడ మన దేశానికి ప్రమాదకరమే. ఈ ఉపగ్రహాలు మనకు వ్యతిరేకంగా గూఢచర్య సమాచార వ్యవస్థలు. కానీ అతి దగ్గరగా నెలకొన్న కక్ష్య’-లో ఎర్త్ ఆర్బిట్- లియో-లో సంచరించే శత్రు దేశాల ‘గూఢచర్య నిర్వాహక ఉపగ్రహాలు’ మరింత ప్రమాదకరమైనవి. మనకు వ్యతిరేకంగా ఇలాంటి ఉపగ్రహాలను చైనా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే ప్రమాదం ఉంది. ఇదివరకే ప్రవేశపెట్టి ఉండవచ్చు కూడ. అందువల్ల ఇలాంటి ‘లియో’ ఉపగ్రహాలను విధ్వంసం చేయడం మన ‘్భద్రత’ను పెంపొందించుకొనడానికి అనివార్యం. అంతర్గత భద్రత, సరిహద్దుల భద్రత పెంపొందడానికి బుధవారం నాటి విజయం అందువల్ల దోహదకరం. భూమికి దగ్గరగా మూడువందల కిలోమీటర్ల ఎత్తున అంతరిక్షంలో తిరుగుతుండిన ఉపగ్రహాన్ని మన ‘క్షిపణి’ ధ్వంసం చేయగలిగిందన్నది ప్రధానమంత్రి వెల్లడించిన గగన విజయం. అంతరిక్ష యుద్ధరీతులను దశాబ్దుల క్రితమే అమెరికా, రష్యా వంటి దేశాలు ఆవిష్కరించగలిగాయి. చైనా కూడ ఈ ‘అంతరిక్ష యుద్ధరీతుల’- స్టార్‌వార్స్-ను పెంపొందించుకోవడం మన రక్షణకు ప్రమాదకరంగా పరిణమించింది. అందువల్ల ‘ఉపగ్రహ విధ్వంసక క్షిపణు’లను మనం సమకూర్చుకోవడం అనివార్యం అన్నది మన ప్రధానమంత్రి చెప్పిన మాట! రథ, గజ, తురగ, పదాతి దళాలు చతురంగ బలాలు కావడం మన దేశంలో అనాది సంప్రదాయం. రథాలనెక్కి, ఏనుగుల నెక్కి, గుర్రాల నెక్కి వీరులు యుద్ధం చేసేవారు. అత్యధిక ‘సమరులు’ నేలపై నిలబడి శత్రుమూకలతో తలపడేవారు. ఇదీ నాలుగు విధాల- చతురంగ- సైన్యం. విదేశీయ బీభత్స మూకలు దురాక్రమించడం మొదలైన తరువాత నౌకాదళం ప్రాధాన్యం పెరిగింది. ‘రథాలు’ నౌకలయ్యాయి, శత్రువులను ప్రతిఘటించాయి. ఆధునిక ప్రపంచంలో ‘త్రివిధ’-్భసేన, జలసేన, వాయుసేన- రక్షణ దళాలు ప్రాచుర్యం పొందాయి. నాలుగవది ‘అంతరిక్ష సేన’. ఇలా సరికొత్త రీతిలో ‘చతురంగ’ దళాలు సిద్ధం కావడం చారిత్రక పునరావృత్తి! బుధవారం నాడు ప్రధానమంత్రి వెల్లడించిన విజయంతో మన దేశానికి కూడ ఇలా ఆధునిక చతురంగ బలాలు-్భసేన, జలసేన, వాయుసేన, అంతరిక్ష సేన- సమకూడాయి. అందువల్ల అంతరిక్షంలో సైతం మన వీరులు ఇకపై శత్రువులను ప్రతిఘటించగలరు..
మన ప్రధాన శత్రువు చైనా. దశాబ్దుల తరబడి చైనా సాగిస్తున్న వ్యూహాత్మక దురాక్రమణలో ఇప్పుడిలా చిత్రపటాలను ధ్వంసం చేయడం భాగం. ఒక విదేశానికి ఎగుమతి చేయడానికై చైనాలో ‘అన్‌హురుూ’ ప్రాంతంలో ఈ ఇరవై తొమ్మిది వేల చిత్రపటాలను ముద్రించారట. ఈ చిత్రపటాలలో అరుణాచల్ ప్రదేశ్ మన దేశంలో భాగంగా చూపించడం చైనా ప్రభుత్వానికి నచ్చని వ్యవహారం. ‘అరుణాచల్ ప్రదేశ్’ తమ దేశంలో భాగమన్న వాదాన్ని చైనా 1950వ దశకంలో మొదలుపెట్టింది. అంతకు పూర్వం అరుణాచల్ ప్రాంతం గురించి చైనావారికి తెలియదు. అరుణాచల్ ప్రాంతం అనాదిగా మన దేశంలో భాగమన్న వాస్తవాన్ని చైనా ప్రభుత్వాలు 1950వ దశకానికి పూర్వం నిరాకరించలేదు. అందువల్ల 1950వ దశకంలో చైనా మాట మార్చినప్పటికీ, అరుణాచల్ ప్రదేశ్‌పై ఇలా తమ దేశంలో ప్రచారం చేస్తున్నప్పటికీ చైనా ప్రజలు, టిబెట్టు ప్రజలు ఈ అబద్ధాన్ని విశ్వసించడం లేదు. విశ్వసించడం లేదన్నది ఇప్పుడిలా ఈ చిత్రపటాల ముద్రణ ద్వారా మరోసారి ధ్రువపడింది. అరుణాచల్ మన దేశంలో భాగమన్న వాస్తవాన్ని మ్యాపులను ముద్రించిన సంస్థవారు విశ్వసించారు. 1950వ సంవత్సరానికి పూర్వం చైనా ప్రభుత్వం ముద్రించిన చిత్రపటాలలో అరుణాచల్ భారతదేశంలో భాగంగా చూపించారు.

అందువల్ల ఆ తరువాత చైనా కమ్యూనిస్టులు అరుణాచల్ తమదేనని ప్రచారం మొదలుపెట్టినప్పటికీ చైనా ప్రజలకు మాత్రం అరుణాచల్ మన దేశంలో ఉందన్న వాస్తవం మాత్రమే తెలుసు. చైనా ప్రభుత్వం ‘‘అజాగ్రత్తగా’’ ఉన్నప్పుడల్లా చైనీయ ముద్రణ సంస్థలు ఇలా చారిత్రక భౌగోళిక వాస్తవాలను ఆవిష్కరిస్తున్నాయి. ఈ ఇరవై తొమ్మిది వేల చిత్రపటాల ముద్రణ ఇందుకు సరికొత్త సాక్ష్యం. ఈ చిత్రపటాలను ఒక విదేశానికి ఎగుమతి చేస్తుండిన సమయంలో ‘క్వింగ్‌దావో’ ఓడరేవులో అధికారులు తనిఖీ చేసినప్పుడు ఈ వాస్తవం బయటపడింది. అందువల్ల చైనా అధికారులు ఈ ‘మ్యాపుల’ను చింపి పోగులు పెట్టారట! పంచాంగాలను చింపివేస్తే గ్రహాల స్థితులు మారిపోతాయన్న భ్రాంతికి ఇది మరో ఉదాహరణ…
అరుణాచల్ ప్రదేశ్ ‘టిబెట్’లో భాగమని చైనా టిబెట్‌ను దురాక్రమించి దిగమింగిన నాటినుండి వాదిస్తోంది. 1959కి పూర్వం టిబెట్ స్వతంత్ర దేశం. మన దేశానికి ఉత్తరంగాను, చైనాకు దక్షిణంగాను టిబెట్ నెలకొని ఉంది, భారత్-చైనాలకు మధ్యలో ఉంది. క్రీస్తుశకం 1914లో స్వతంత్ర టిబెట్‌కూ, బ్రిటన్ దురాక్రమిత భారత్‌కూ మధ్య ‘సిమ్లా’లో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో అరుణాచల్ భారత్‌లో భాగమన్న చారిత్రక వాస్తవాన్ని, భౌగోళిక వాస్తవాన్ని స్వతంత్ర టిబెట్ ప్రభుత్వం అంగీకరించింది. కానీ స్వతంత్ర టిబెట్‌ను ఆక్రమించుకున్న విదేశీయ దుష్టశక్తి చైనా! అరుణాచల్ తరతరాలు భారత్‌లో భాగమన్నది వాస్తవం కాకపోతే 1914లో టిబెట్ ప్రభుత్వం ఈ సంగతిని చెప్పి ఉండేది. టిబెట్ అంగీకరించిన సత్యాన్ని చైనా నిరాకరించడం వ్యూహాత్మక దురాక్రమణలో భాగం. ఈ దురాక్రమణ శక్తిని ప్రతిఘటించగల మన సమరశక్తి బుధవారం నాటి విజయంతో మరింత పెరిగింది. మన దేశం ఇతర దేశాలపై దాడిచేసే రాక్షస శక్తికాదు, యుగయుగాలుగా కాదు.. కాబోదు! మన దేశం దాడి చేసిన విదేశీయులను దండించిన శక్తి, ప్రతిఘటించిన సజ్జన శక్తి! భవిష్యత్తులో కూడ మన దేశం ఇలా దండించగలదు, ప్రతిఘటించగలదు. ఈ ప్రతిఘటనాశక్తి ఇప్పుడు మరింత పెరిగింది, పెరగనుంది.